హైదరాబాద్‌లో నకిలీ సీబీఐ ముఠా అరెస్టు

హైదరాబాద్‌లో నకిలీ సీబీఐ ముఠా అరెస్టు

హైదరాబాద్ నగరంలో సీబీఐ అధికారులుగా చెలామణి అవుతూ పలువురిని మోసం చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ముఠాలో దాదాపు 18 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒక మహిళ కూడా సీబీఐ అధికారిణిలా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడినట్లు సమాచారం. 18 మంది సభ్యుల ముఠాను పేట్ బషీరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముగ్గురు నిందితులు పరారైనట్లు పోలీసు వర్గాల కథనం. పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధి సుచిత్ర గోదావరి హోమ్స్ లో ఉండే పద్మలత ఇంట్లో సీబీఐ అధికారులు అంటూ ఈనెల 1వ తేదీన వీరు తనిఖీలు చేశఆరు. బ్లాక్ మనీ ఉందనే సమాచారం మేరకు 19 మంది ఆమె ఇంటిపై సీబీఐ అధికారులమంటూ వెళ్లి తనిఖీల పేరుతో హడావుడి చేశారు. ఆమె ఇంట్లో ఎలాంటి బ్లాక్ మని లభించకపోవడంతో నకిలీ సీబీఐ ముఠా వెనుదిరిగి వెళ్లిపోయింది. దీనిపై అనుమానం వచ్చిన పద్మలత పేట్ బషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెెమెరాల ఫుటేజీని పరిశీలించి తనిఖీలు చేయగా.. శనివారం నకిలీ సీబీఐ ముఠా పట్టుపడింది. వీరిలో ముగ్గురు తప్పించుకున్నట్లు తెలిసింది. నిందితులంతా హైదరాబాద్ నగరానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు, ముఠా లో ఒకరు పాత నేరస్తుడు ఉన్నట్టు గుర్తించారు. పక్కా ప్రణాళికతో పద్మలత ఇంటిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. పద్మలత భర్తకు ఓ రైస్ మిల్ ఉండడంతో డబ్బు దొరుకుతుందనే నమ్మకం తో దాడి చేసిన ముఠా..ఏమీ దొరక్కపోవడంతో వెనుదిరిగి వెళ్లారు. ఈ ముఠాను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.