ఫేక్ ఇన్సూరెన్స్​ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్లు

ఫేక్ ఇన్సూరెన్స్​ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్లు
  • ఫేక్ ఇన్సూరెన్స్​ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్లు, నకిలీ ఆధార్ తో లైసెన్సులు
  • అధికారుల సపోర్టుతో కథ నడిపిస్తున్న ఏజెంట్లు
  • క్యూఆర్, బార్​ కోడ్​ స్కానర్ కు చిక్కకుండా మేనేజ్ 

ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఒకరు ఆరు నెలల కింద హైదరాబాద్​లో సెకండ్​ హ్యాండ్​ కారు(టీఎస్11 యూసీ 0649) కొన్నారు. తన పేరు మీద కారు రిజిస్ట్రేషన్​ చేయించుకునేందుకు సత్తుపల్లి ఆర్టీఏ ఆఫీస్​లో పేపర్లు సబ్​మిట్ చేశారు. అందులోని ఇన్సూరెన్స్​ పేపర్​ నకిలీదని అక్కడే ఉన్న ఓ ఇన్సూరెన్స్​ ఏజెంట్ గుర్తించాడు. నకిలీదనే విషయం తెలియనంత పక్కాగా ఫేక్​ ఇన్సూరెన్స్​ డాక్యుమెంట్ ఉండడంతో ఆశ్చర్యపోయాడు. పోలీసులకు, రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఎంక్వైరీ చేసిన పోలీసులు వీఎం బంజరకు చెందిన ఏజెంట్ ఆ ఫేక్​ డాక్యుమెంట్ ను తయారు చేసినట్లు గుర్తించారు. అతడిని ప్రశ్నించి వదిలేసిన పోలీసులు, ఇంత వరకు ఎఫ్ఐఆర్​ నమోదు చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటివి ఇప్పటికే చాలా చేశామని, ఆఫీసర్లకు కూడా తెలుసని ఆ ఏజెంట్ చెప్పడం, తేనెతుట్టె లాంటి వ్యవహారాన్ని కదల్చడం ఎందుకని పోలీసులు భావించి ఫిర్యాదును పక్కన పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు మూడు నెలల క్రితం పెనుబల్లి సమీపంలో ఒక కారు, టూ వీలర్​ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి చనిపోయాడు. ఈ ప్రమాదంలో కారు ఇన్సూరెన్స్​ పేపర్​ నకిలీది కావడంతో మృతుడికి ఎలాంటి పరిహారం దక్కలేదు. 

ఖమ్మం/సత్తుపల్లి, వెలుగు: ఫేక్ ఇన్సూరెన్స్ లతో వాహనాల రిజిస్ట్రేషన్లు, ఫేక్​ అడ్రస్ లతో లైసెన్సులు ​ఇచ్చే​దందాకు సత్తుపల్లి ఆర్టీఏ ఆఫీస్​ కేంద్రంగా మారింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట, దమ్మపేటకు చెందిన వారికి, ఏపీకి చెందిన వారికి కూడా ఫేక్​ ఆధార్​ కార్డులతో సత్తుపల్లి అడ్రస్ తో లైసెన్సులు మంజూరు చేయడం, వాహనానికి ఇన్సూరెన్స్​ లేకున్నా నకిలీ పేపర్లతో రిజిస్ట్రేషన్లు చేయడం, సీసీలు ఇవ్వడం ఇక్కడ కామన్​గా మారింది. హెవీ వెహికల్  లైసెన్స్​ కావాలనుకునే వారికి ​డ్రైవింగ్ స్కూల్​ కు సంబంధించిన ఫేక్​ సర్టిఫికెట్ సబ్ మిట్ చేయడం, దానిపై జిల్లా రవాణా శాఖ అధికారి సంతకాన్నిఫోర్జరీ చేయడం, ఇతర రాష్ట్రాల నుంచి ఎన్​వోసీ తెచ్చుకున్న వాహనాలు గడువులోగా రిజిస్ట్రేషన్​ చేయించుకోకపోతే లేట్ ఫీజు వసూలు చేయకుండా పైసలు తీసుకొని మేనేజ్​ చేయడం, ఫైనాన్స్​ చేయించుకున్న వాహనాల స్టాంప్​ డ్యూటీ చలానాలను జిరాక్స్​ తీసి ఇతర వాహనాలకు ఉపయోగించి గవర్నమెంట్ ఆదాయానికి గండి కొట్టడం.. ఇలా ఆర్టీఏ ఏజెంట్లు నడిపిస్తున్న ప్రతి అక్రమ వ్యవహారంలో అధికారులకు కూడా వాటాలందుతున్నాయనే ఆరోపణలున్నాయి. 

ఫేక్​ ఆధార్​కార్డులతో..

సత్తుపల్లి ఆర్టీఏ ఆఫీసు నుంచి జనరేట్ అయిన డ్రైవింగ్ లైసెన్సులు, రిజిస్ట్రేషన్​ అయిన వాహనాలను గమనిస్తే మెయిన్​ రోడ్డు–సత్తుపల్లి, మసీద్ రోడ్డు–సత్తుపల్లి, వీటీ రోడ్డు–సత్తుపల్లి అడ్రస్ తోనే ఉంటాయి.సత్తుపల్లిలోని ఆర్టీఏ ఏజెంట్లను కలిసి అడిగినంత డబ్బులు ఇస్తే చాలు లోకల్ అడ్రస్​తో కొద్ది రోజుల్లోనే డ్రైవింగ్ లైసెన్స్​ సిద్ధమవుతుంది. రిజిస్ట్రేషన్ల సమయంలో ఇన్సూరెన్స్​ కట్టాలంటే రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు ఖర్చవుతుంది. అదే ఏజెంట్లకు రూ.2 వేలు ఇస్తే చాలు బార్​ కోడ్​ స్కానర్​లో కూడా దొరకకుండా ఫేక్​ ఇన్సూరెన్స్​ సర్టిఫికెట్ ను క్రియేట్ చేస్తారు. లైసెన్స్​కు రూ.500 , వెహికల్ రిజిస్ట్రేషన్​కు రూ.200 ఇలా ప్రతి పనికి ఆఫీసర్లకు మామూళ్లు ముట్టచెబుతున్నామని ఆర్టీఏ ఏజెంట్లు ఓపెన్ గానే చెబుతున్నారు. 

ఏసీబీ ఎంక్వైరీ చేసినా..

సత్తుపల్లి ఆర్టీఏ ఆఫీసులో అక్రమాలపై కంప్లైంట్లు రావడంతో గతేడాది ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేశారు. హెవీ వెహికల్ లైసెన్సులకు సంబంధించి ఆఫీసులో ఎలాంటి ఫైళ్లు లేవనే విషయాన్ని గుర్తించినట్లు సమాచారం. సత్తుపల్లి ఓపెన్ కాస్ట్ లో డ్రైవర్లుగా పని చేస్తున్న వారికి హెవీ లైసెన్స్​ అవసరం ఉంటుంది. ఇలా రెండేళ్లలో జారీ చేసిన 600 లైసెన్సుల్లో దాదాపు 50 శాతం రూల్స్​కు విరుద్ధంగా ఇచ్చినవేనని ఏసీబీ అధికారుల ఎంక్వైరీలో తేలినట్లు తెలుస్తోంది. ఎంక్వైరీ రిపోర్టును ఉన్నతాధికారులకు అందించిన తరువాత సదరు అధికారి బదిలీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని సమాచారం.గత ఆరు నెలల్లో సత్తుపల్లి ఆర్టీఏ ఆఫీసులో జరిగిన వాహనాల రిజిస్ట్రేషన్లు, లైసెన్సులపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. 

పోలీసులకు ఫిర్యాదుచేశాం

ఆరు నెలల క్రితం సత్తుపల్లిలో ఫేక్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ ను గుర్తించి పోలీసులకు ఫిర్యాదుచేశాం. ఎఫ్ఐఆర్​ ఎందుకు నమోదు చేయలేదో తెలియదు. ఫేక్​ సర్టిఫికెట్లు పెడితే ప్రమాదం జరిగిన సమయంలో ఇన్సూరెన్స్​ వర్తించదు. ఫేక్​ ఇన్సూరెన్స్​ తీసుకున్న ఓనర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం.–తోట కిషన్​రావు, డీటీవో, ఖమ్మం