నకిలీ సర్టిఫికెట్ల కంట్రోల్ ఎట్ల?

నకిలీ సర్టిఫికెట్ల కంట్రోల్ ఎట్ల?
  • ఇతర స్టేట్ వర్సిటీల సర్టిఫికెట్లపై నజర్ కరువు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల ఫేక్ సర్టిఫికెట్ల బెడద రోజురోజుకూ పెరుగుతోంది. మొన్న జగిత్యాల, నిన్న హైదరాబాద్, తాజాగా వరంగల్.. ఇలా నిత్యం ఏదో ఒక చోట నకిలీ సర్టిఫికెట్ల కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటితో కొందరు విదేశాలకు పోతే, ఇంకొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి కొందరు ప్రమోషన్లు పొందుతున్నారు. వీటిపై ఫిర్యాదు వస్తేనే అధికారులు విచారించి, ఫేక్ సర్టిఫికెట్లని గుర్తిస్తున్నారు తప్ప, వాటిని తొలి దశలోనే గుర్తించే వ్యవస్థ రాష్ట్రంలో లేకుండా పోయింది. తమ పని కాదని ఉన్నత విద్యా మండలి అధికారులు, పోలీసులు చేతులేత్తుస్తున్నారు.

తాజాగా రాష్ట్రంలోని యూనివర్సిటీల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం ఉన్నత విద్యా మండలి ‘ఆన్​లైన్ స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్’ పేరుతో శుక్రవారం వెబ్ పోర్టల్​ను ప్రారంభిస్తోంది. టెక్నాలజీ పెరుగుతుండడంతో, దానికి అనుగుణంగా మోసాలూ పెరుగుతున్నాయి. అంగడిలో కూరగాయల్లా అన్ని రకాల సర్టిఫికెట్లు లభిస్తున్నాయి. కాలేజీకి పోకున్నా, అసలు చదువకున్నా.. డబ్బులిస్తే సర్టిఫికెట్లు వచ్చేస్తున్నాయి. డిగ్రీ నుంచి బీటెక్ వరకూ అన్ని రకాల ధ్రువపత్రాలను కేటుగాళ్లు తయారు చేస్తున్నారు. ఒక్కో సర్టిఫికెట్​కు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకూ తీసుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకూ ఇతర రాష్ర్టాలకు చెందిన సర్కారు, ప్రైవేటు వర్సిటీలకు చెందిన సర్టిఫికెట్లు మాత్రమే నకిలీవి తయారు చేస్తుండగా, తాజాగా ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వర్సిటీలకు చెందిన ఫేక్ సర్టిఫికెట్లు బయటపడ్డాయి.

కొందరు పలు వర్సిటీల్లోని అధికారులతో చేతులు కలిపి ఈ దందా కొనసాగిస్తున్నారు. ఈ దందాలో దొరికితే దొంగ లేకుంటే దొర అన్న చందంగా మారిపోయింది. కస్టమ్స్  విభాగంలో ఫేక్ సర్టిఫికెట్లతో ఓ వ్యక్తి ఉద్యోగం ఉంది 30 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశాడు. ఆయనపై ఫిర్యాదు రావడంతో అధికారులు ఎంక్వైరీ చేసి  నకిలీగా తేల్చారు. దీంతో ఆ ఉద్యోగిని సస్పెండ్ చేశారు. జేఎన్టీయూతో పాటు అన్ని వర్సిటీల్లోని కాలేజీల్లో పనిచేసే అనేక మందిపై పీహెచ్ డీ, పీజీ పట్టాలపై అనేక అభ్యంతరాలున్నా, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. 

అన్నివర్సిటీల సర్టిఫికెట్లు... 

ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఏపీ, మహారాష్ట్ర, హిమాచల్​ ప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, పంజాబ్, సిక్కిం, ఝార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన సూమారు 30కి పైగా వర్సిటీలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను అమ్ముతున్నట్లు ఇటీవల వరంగల్​లో బహిర్గతమైంది. జులై నెలాఖరులో జగిత్యాల, హైదరాబాద్​లో పలు అకాడమీలపై పోలీసులు దాడులు చేసి 18 వర్సిటీలకు చెందిన ఫేక్  సర్టిఫికెట్లను గుర్తించారు. అయితే ఫేక్ సర్టిఫికెట్ల దందాలో ఆయా వర్సిటీలకు చెందిన వారి పాత్ర కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భోపాల్​లోని ఓ ప్రైవేటు వర్సిటీ వీసీ, మాజీ వీసీ, ఇతర అధికారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వ్యక్తి అమెరికాలో ఉండి ఫేక్ దందా నడిస్తున్నట్లు గుర్తించారు. అతడూ ఓయూలో హోటల్ మేనేజ్మెంట్ లో నకిలీ పట్టా పొంది 2021లో అమెరికా పోయాడు. ఇలాంటి ఘటనలు నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి. 

ఇయ్యాల స్టేట్ పోర్టల్ ప్రారంభం

రాష్ట్రంలోని సర్కారు వర్సిటీల్లో చదివిన స్టూడెంట్ల సర్టిఫికెట్లను ఉన్నత విద్యా మండలి ఆన్​లైన్ ద్వారా అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 2010 నుంచి ఇప్పటి వరకూ చదువు పూర్తయిన ప్రతి విద్యార్థి వివరాలను ఆన్​లైన్​లో పొందుపర్చారు. ఈ లెక్కన సుమారు 25 లక్షల స్టూడెంట్ల సర్టిఫికెట్లు ఒకేచోట చేర్చామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. ఈ ఆన్​లైన్ స్టూడెంట్ అకాడమిక్ వెరిఫికేషన్ సర్వీస్ ను శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి ప్రారంభిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ పోర్టల్ ద్వారా నకిలీ సర్టిఫికెట్లను ఈజీ గుర్తించవచ్చని ఆయన తెలిపారు.