భూదాన్ పోచంపల్లిలో నకిలీ ఇక్కత్ చీరలు

భూదాన్ పోచంపల్లిలో నకిలీ ఇక్కత్ చీరలు
  •      పవర్​లూమ్స్​పై ప్రింట్​ చేసిన చీరలమ్ముతున్న షాపుల ఓనర్లు  
  •     11 దుకాణాల్లో దొరికిన డూప్లికేట్​చీరలు  
  •     అధికారుల తనిఖీల్లో గుర్తింపు  

భూదాన్ పోచంపల్లి వెలుగు : ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి గాంచిన భూదాన్ పోచంపల్లిలోని షాపుల్లో నకిలీ చీరలమ్ముతున్నారు. మంగళవారం విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ చీరలు బయటపడ్డాయి. ఒరిజినల్​ఇక్కత్ చీరలను మగ్గం మీద నేస్తారు. డిజైన్​ను బట్టి ఒక్కో చీరకు నెల రోజులు లేదా అంతకన్నా ఎక్కువే టైం పడుతుంది. అందుకే ధర వేలల్లో ఉంటుంది. అయితే, కొంతకాలంగా ఇక్కత్ ప్రింట్​ను కాపీ చేస్తూ కొందరు పవర్ లూమ్స్​పై తయారుచేసి మార్కెట్​లోకి తక్కువ రేట్లకే అమ్ముతున్నారు.

మగ్గంపై నేసిన చీర ధర సుమారు రూ.6వేలకు పైగా ఉంటే నకిలీ చీరలను షాపుల్లో రూ.300కే అమ్ముతున్నారు. దీనిపై చేనేత కార్మికులు అధికారులతో పాటు ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం 15 మంది రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్​ఫోర్స్​మెంట్​అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి భూదాన్ పోచంపల్లిలోని 12 షాపుల్లో తనిఖీలు చేశారు. 11 షాపుల్లో డూప్లికేట్ ఇక్కత్ చీ రలు దొరికాయి. వాటిని సీజ్ చేసి యజమానులకు నోటీసులిచ్చారు.

ప్రింట్లను తయారుచేసిన కంపెనీలపై కేసులు నమోదు చేస్తామని విజిలెన్స్ అండ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశం తెలిపారు. పోచంపల్లి చీరలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు(జియోగ్రాఫికల్​ ఇండికేషన్​) ఉంటుందని, జియో ట్యాగ్​చూసి మాత్రమే కొనాలన్నారు. తనిఖీల్లో అధికారులు విద్యాసాగర్, ప్రసాద్, జయరావు, ప్రవీణ్, సంధ్య, అనిల్, బాలమోహన్‌రెడ్డి, ఏడీఓ సాయికుమార్, కిషన్,  సత్యనారాయణ, షకీల్ పాల్గొన్నారు. బట్టల షాపులపై అధికారుల దాడులను స్వాగతిస్తున్నామని బీసీ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధ్యక్షుడు దాసు సురేశ్​ అన్నారు. షాపింగ్​ మాల్స్​లో తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు.