2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం..15 మంది అరెస్టు

2 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం..15 మంది అరెస్టు

వరంగల్ జిల్లాలో నకిలీ విత్తనాల రాకెట్ గుట్టురట్టయ్యింది. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న రెండు ముఠాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నకిలీ విత్తనాలు అమ్ముతున్న 15 మందిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.2కోట్ల విలువైన నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. 7 టన్నుల విడి విత్తనాలు, 9వేల 765 నకిలీ విత్తనాల ప్యాకేట్లు, డీసీఎం, కారు, రూ. 21 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్రాండెడ్ కంపెనీ కవర్లలో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా నాలుగు రాష్ట్రాల్లో నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ, కార్ణటక, మహారాష్ట్ర, గుజరాత్ లో ఈ ముఠా దందా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

 

రెండు ముఠా సభ్యుల వివరాలు

1. దాసరి శ్రీనివాస్, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ 2. చేదాం పాండు, హైదరాబాద్ 3. కొప్పుల రాజేష్, మంచిర్యాల్ 4. వడిచర్ల సురేందర్ రెడ్డి, చంద్రపూర్, మహారాష్ట్ర 5. ఎన్గూడే దిలీప్, బలార్ష, మహరాష్ట్ర 6. భోగే సత్యం, మంచిర్యాల 7. షేక్ అన్జద్, మంచిర్యాల 8. ఇందుర్తి వెంకటేష్, మంచిర్యాల 9. పుట్ట రాజేశం, మంచిర్యాల 10. చేదాం వెంకటరమణ, హైదరాబాద్, 11. చేదాం నాగరాజు, మహబూబాబ్నగర్ 12. సుందర్ శెట్టి ఫణీందర్, బాపట్ల, ఆంధ్రప్రదేశ్ 13. కాల్వ శ్రీధర్, నాగర్ కర్నూల్ జిల్లా 14. తాప్తే హనుమంతు, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ 15. వేముల అరవింద్ రెడ్డి, హైదరాబాద్ చెందిన వారిని అరెస్టు చేయగా.. మరో ముగ్గురు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.  

 

రైతులను ఇలా బురిడీ కొట్టించారు. 

ఒక ముఠాలోని సభ్యులు రైతుల నుండి తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలను అతి తక్కువ ధరకు  విత్తనాలు కొనుగోలు చేస్తారు. ఈ ముఠాలోని  దాసరి శ్రీనివాసరావు, భాస్కర్ రెడ్డి కర్ణాటక రాష్ట్రంలోని విత్తన కంపెనీలకు తరలించి, అక్కడ విత్తన శుద్ధి చేస్తారు. ఈ శుద్ధి చేసిన నకిలీ విత్తనాలను ఫేమస్ విత్తన కంపెనీల పేర్లతో ఆకర్షణీయంగా ప్యాక్ చేస్తారు. వాటిని రైతులకు అమ్ముతుంటారు. ఈ సమయంలో రైతులకు మాయమాటలు చెప్తారు. ఈ విత్తనాలు గడ్డి మందును కూడా తట్టుకుంటాయని..ఎక్కువమార్లు కలుపు తీయాల్సి అవసరం ఉందని నమ్మిస్తారు. అంతేకాకుండా ఇలాంటి విత్తనాలు డీలర్ల వద్ద ఉండవని..రైతులను ఎక్కువ ధరలకు అమ్ముతారని వరంగల్ పోలీసులు తెలిపారు. 

మరో ముఠాకు సంబంధించిన ప్రధాన నిందితుడు చేదాం పాండుకు ప్రభుత్వ అనుమతులు కలిగిన రుషి, మరియు శ్రీగణేష్ విత్తన శుద్ది కంపెనీ ఉంది. ఈ కంపెనీ ద్వారా అసలైన నర్మద కంపెనీ చెందిన విత్తన ప్యాకేట్లను తీసిపోని విధంగా నకిలీ నర్మదా కంపెనీ విత్తనాల ప్యాకెట్లను తయారు చేస్తున్నారు. ఈ ప్యాకెట్లపై క్యూఆర్ కోడ్, విత్తన తయారీ, గడువు తారీఖులు, క్రమ సంఖ్య, యం.ఆర్.పిలు కూడా ముద్రిస్తున్నారు. నకిలీ విత్తనాలతో కూడిన నర్మదా కంపెనీ విత్తన ప్యాకెట్లను మరికొందరు నిందితుల సహకారంతో తెలంగాణలోని వివిధ జిల్లాల్లో విక్రయిస్తున్నారని పోలీసులు తెలిపారు. 

ఈ సమాచారం పక్కాగా తెలుసుకునన టాస్క్ ఫోర్స్ పోలీసులు..మడికొండ, ఎనమాముల, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి నిందితుల గుట్టు బయటపెట్టారు.  రెండు బృందాలు ఏర్పడి.. జూన్ 07 వ తేదీన నిందితులను అరెస్టు చేశారు. తమదైన స్టైల్లో విచారించగా..అసలు విషయాలన్ని వెలుగులోకి వచ్చాయి.