ఫేక్​ సర్వేల హల్​చల్.. సోషల్​ మీడియాలో వైరల్​

ఫేక్​ సర్వేల హల్​చల్.. సోషల్​ మీడియాలో వైరల్​
  • అభ్యర్థుల పేర్లు.. నియోజకవర్గాల సంఖ్య మార్చి రిపోర్టు
  • ఎవరు పోటీ చేస్తున్నారో తెలియకుండానే ఫలితాలు
  • ఎక్కువ సీట్లు వచ్చిన సర్వే రిపోర్టులో పార్టీ పేరు మార్ఫింగ్​
  • లగడపాటి రాజగోపాల్​పేరిట బయటకు నకిలీ సర్వే

హైదరాబాద్, వెలుగు :  గత రెండు రోజుల నుంచి కొన్ని ఫేక్​ సర్వేలు హల్​చల్ ​చేస్తున్నాయి. అభ్యర్థుల వివరాలు, అసెంబ్లీ స్థానాలతో నిమిత్తం లేకుండా ఫలితాలు బయటకొస్తున్నాయి. ఉన్న నియోజకవర్గాల కన్నా ఒకట్రెండు నియోజకవర్గాలను ఎక్కువేసి సర్వేలు రిలీజ్​చేస్తున్నారు. ఏదైనా ఓ పార్టీకి ఎక్కువ సీట్లు రాబోతున్నట్లు సర్వేలు బయటకొస్తే.. ప్రత్యర్థి పార్టీల నేతలు ఆ సర్వేను మార్ఫింగ్ ​చేసి.. తమకు కావాల్సినన్ని స్థానాలు వేసుకుంటున్నారు. జనాలను కన్ఫ్యూజన్​లోకి నెట్టి లాభపడాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి పనులు చేస్తున్నట్లు తెలుస్తున్నది.  

నేషనల్ ​మీడియా పేరిట ఫేక్​ రిపోర్ట్​

గత రెండు రోజుల నుంచి నాలుగైదు ఫేక్​ సర్వేలు సోషల్​మీడియాలో వైరల్​అవుతున్నాయి. రెండు రోజుల క్రితం వచ్చిన ఓ సంస్థ సర్వేలో నారాయణఖేడ్​నుంచి సురేశ్​షెట్కార్​ గెలుస్తారంటూ పేర్కొన్నారు. కానీ, అక్కడ సురేశ్​ షెట్కార్​ పోటీ చేయడం లేదు. అక్కడ కాంగ్రెస్​ నుంచి సంజీవ్​రెడ్డి బరిలో ఉన్నారు. తాజాగా బయటకొచ్చిన మరో సర్వేలో కొత్తగూడెంలో కాంగ్రెస్​ గెలుస్తుందని పేర్కొన్నారు. కానీ, అక్కడ సీపీఐ బరిలో ఉంది. లగడపాటి రాజగోపాల్​రెడ్డి పేరిట మరో సర్వే ఫలితాన్ని సోషల్​మీడియాలో వైరల్ ​చేస్తున్నారు.

కాగా మాజీ ఎంపీ అయిన లగడపాటి రాజగోపాల్​ఎన్నికల సర్వేలనే మానేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, ఆయన సర్వే చేశారంటూ ఫేక్​ సర్వే రిపోర్టును సర్క్యులేట్​చేస్తున్నారు. మరో ప్రముఖ సంస్థ మంగళవారం విడుదల చేసిన సర్వేలో ఓ పార్టీకి పూర్తి మెజారిటీ ఇస్తే.. ఆ పార్టీ స్థానంలో ప్రత్యర్థి పార్టీ పేరు చేర్చి.. ఫేక్​ సర్వే సృష్టించారు. మరో సర్వేలోనైతే రాష్ట్రంలో ఉన్న స్థానాలకన్నా రెండు స్థానాలను ఎక్కువే వేసి సర్వే రిపోర్టు రిలీజ్ చేశారు. రెండు ఉమ్మడి జిల్లాల్లో ఉండాల్సిన సీట్ల కన్నా ఒక్కో సీటును ఎక్కువేసి సర్వేని పబ్లిష్​ చేశారు. అన్ని సర్వేలూ కాంగ్రెస్​వైపే మొగ్గుతున్నాయంటూ ఓ నేషనల్​మీడియా పేరిట మరో సర్వేనూ కొందరు వ్యక్తులు సోషల్​మీడియాలో వైరల్​ చేశారు. అది ఫేక్​ అని ఆ సంస్థ క్లారిటీ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

జనాలు కన్ఫ్యూజ్​ అవుతున్నరు

ఫేక్​సర్వేలు హల్​చల్​చేస్తుండటంతో జనాలు కన్ఫ్యూజన్​లో పడిపోతున్నారు. వాస్తవానికి జనాలను గందరగోళానికి గురిచేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఫేక్​సర్వేలను సోషల్​మీడియాలో వదిలి విపరీతంగా ప్రచారంలోకి తెస్తున్నారన్న చర్చ జరుగుతున్నది.