పక్కా పథకం ప్రకారమే నాపై తప్పుడు ప్రచారం: మంత్రి ఈటల రాజేందర్

 పక్కా పథకం ప్రకారమే నాపై తప్పుడు ప్రచారం: మంత్రి ఈటల రాజేందర్

హైదరాబాద్: తనపై వచ్చిన ఆరోపణలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. తన సతీమణి జమునతో కలసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ముందస్తు పథకం ప్రకారమే నాపై తప్పుడు ప్రచారానికి దిగారని.. పథకం ప్రకారం నాపై భూ కబ్జాదారుడని ఒకేసారి కొన్ని టీవీల్లో నాపై ప్రచారం జరగడం దుర్మార్గమని మంత్రి ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవాలు జనానికి తెలియజేయాలనే తాను మీడియా సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని.. అంతిమ విజయం ధర్మానిదేనని ఆయన పేర్కొన్నారు. 
1992లోనే 50 కోళ్ల ఫారాలు ఉన్నాయి
జమునా హ్యాచరీస్ పేరుతో తాను కోళ్ల ఫారం వ్యాపారాలు చేస్తున్నానని.. అచ్చంపేట.. హకీంపేట మారుమూల గ్రామాల్లో ఎకరా 6 లక్షలు ప్రకారం 40 ఎకరాలు.. ఒకసారి కొన్నాం.. మరోసారి  7ఎకరాలు కొన్నానని అది కూడా  కెనెరా బ్యాంకు ద్వారా రుణాలు తీసుకుని వ్యాపారాలు చేయిస్తున్నానని చెప్పారు.నాపై కక్ష కట్టి భూకబ్జా కుట్రలను.. కట్టు కథలతో ప్రణాళికా బద్దంగా.. మొదలుపెట్టారని ఈటెల ఆరోపించారు. తెలంగాణ ప్రజల హృదయాల్లో తాను తన కుటుంబం సంపాదించుకున్న గౌరవంలో విషం చల్లే  ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
2004 కంటే ముందే నాకు 124 ఎకరాల భూములున్నాయి
తాను రాజకీయంగా ఎదగడానికి ముందే 2004లో తనకు 124 ఎకరాల భూములున్నాయని మంత్రి ఈటెల వెల్లడించారు. తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను కొని వ్యాపారాలు చేస్తున్నానని.. నేను కొన్నవి వ్యవసాయ భూములు కాదని.. ఎవరి భూములు కూడా కబ్జా చేయలేదని మంత్రి ఈటెల వెల్లడించారు. 

తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం

తాను ఎలాంటి తప్పులు చేయలేదని.. తనపై చేస్తున్న ఆరోపణలను చూసి భరించలేకనే మాట్లాడాల్సి వస్తోందని.. తప్పు చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. తనపై విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనను చూశానని.. ఒకే.. ఏసీబీతోనే కాదు.. సిట్టింగ్ జడ్జితోనూ విచారణ జరిపించండి.. నాపై తప్పులు ధైర్యం ఉంటే రుజువు చేయండి అని మంత్రి ఈటెల సవాల్ చేశారు. కేవలం భూ కబ్జాల ఆరోపణలే కాదు.. మొత్తం నా చరిత్ర మీద... ఎలాంటి విచారణ కైనా సిద్ధమని మంత్రి ఈటెల స్పష్టం చేశారు. తన నియోజకవర్గంలోనే కాదు.. ఎవరి దగ్గరైనా పది రూపాయలు డబ్బులు తీసుకున్న పాపాన పోలేదని.. తన నియోజకవర్గంలోనే కాదు.. తనతో పనులు చేయించుకున్న వారెవరిదగ్గరైనా విచారించుకోవచ్చని మంత్రి ఈటెల రాజేందర్ సూచించారు.