యాపిల్స్‌‌పై జాతి వ్యతిరేక రాతలు.. వ్యాపారులు సర్కార్‌‌కు వార్నింగ్‌‌

యాపిల్స్‌‌పై జాతి వ్యతిరేక రాతలు.. వ్యాపారులు సర్కార్‌‌కు వార్నింగ్‌‌

జమ్మూ:  కాశ్మీర్‌‌ నుంచి దిగుమతి చేసుకుంటున్న యాపిల్స్‌‌పై జాతి వ్యతిరేక రాతలు ఉన్నాయంటూ కథువా జిల్లా యాపిల్‌‌  పండ్ల వ్యాపారులు ఆందోళనకు దిగారు. యాపిల్‌‌ బాక్సుల్ని తెరిచిన  వాళ్లకు ‘‘ మాకు స్వాతంత్య్రం కావాలి’’,  ‘‘ ఐ లవ్‌‌ బుర్హన్‌‌ వనీ’’, ‘‘జాకిర్‌‌ మూసా మళ్లీ రా’’ లాంటి రాతలు కనిపించాయి. దీంతో వాళ్లు పోలీసులకు రిపోర్ట్‌‌ చేశారు. ఈ మెస్సేజీలు ఉన్న యాపిల్స్‌‌ను చూసి జనం వాటిని కొనడంలేదని పండ్లవ్యాపారులు ఆరోపించారు. యాక్షన్‌‌ తీసుకోకుంటే  కాశ్మీర్‌‌ యాపిల్స్‌‌ను బాయ్‌‌కాట్‌‌ చేస్తామని వ్యాపారులు సర్కార్‌‌కు వార్నింగ్‌‌ ఇచ్చారు.

కథువా హోల్‌‌సేల్‌‌ మార్కెట్‌‌ ప్రెసిడెంట్‌‌ రోహిత్‌‌ గుప్తా ఆధ్వర్యంలోని వ్యాపారులు బుధవారం ఇక్కడ నిరసన ప్రదర్శనలు చేశారు. పాకిస్తాన్‌‌, టెర్రరిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాశ్మీర్‌‌ నుంచి వచ్చే యాపిల్‌‌ బాక్సుల్లో ఇంగ్లీష్‌‌, ఉర్దూలో ఇలాంటి రాతలు కనిపిస్తున్నాయని, దీని వెనక ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని  పండ్ల వ్యాపారులు డిమాండ్‌‌ చేశారు. దీనిపై విచారణ మొదలుపెట్టామని డిప్యూటీ ఎస్పీ మజీద్‌‌ చెప్పారు.