చిటపట చినుకుల్లో చట్​పటా స్నాక్స్

చిటపట చినుకుల్లో చట్​పటా స్నాక్స్

చిటపట చినుకుల్లో చట్​పటా స్నాక్స్

కారం కారంగా, కరకరలాడే పాస్తా, నూడిల్స్, సోయా, మసాలా స్టిక్స్.. వాటితోపాటు వేడి వేడిగా చికెన్​ మోమోలు.. వీటన్నింటికీ కాంబినేషన్​గా మరో మాన్​సూన్​ స్పెషల్ ఐటమ్​ గరం చాయ్​. చదువుతుంటేనే.. నోరూరిపోతోంది కదూ! వర్షాకాలపు సాయంకాలాన్ని ఎంజాయ్​ చేయడానికి ఇంతకంటే ఏం కావాలి? మరింకెందుకాలస్యం.. వెంటనే ఈ వంటలు షురూ చేసేయండి.

క్రిస్పీ పాస్తా


కావాల్సినవి :
మైదా – రెండు టేబుల్ స్పూన్లు
పాస్తా – ఒక కప్పు
నూనె – సరిపడా
కార్న్​ ఫ్లోర్ – రెండు టేబుల్ స్పూన్లు
నల్ల ఉప్పు – అర టీస్పూన్
ఉప్పు – ఒకటిన్నర టీస్పూన్
ఆమ్​చూర్ పొడి, చాట్ మసాలా, కారం – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
తయారీ : ఒక గిన్నెలో నీళ్లు పోసి కాగబెట్టాలి. తరువాత పాస్తా, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి ఉడికించాలి. ఆ తర్వాత పాస్తాని వడకట్టాలి. ఒక గిన్నెలో మైదా, కార్న్​ ఫ్లోర్ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని పాస్తా పై చల్లాలి. మరో గిన్నెలో నల్ల ఉప్పు, ఆమ్​చూర్ పొడి, కారం, ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టాలి. పాన్​లో నూనె వేడి చేసి పాస్తా వేగించాలి. వాటిని గిన్నెలోకి తీసుకుని, రెడీ చేసి పెట్టిన మసాలా మిశ్రమాన్ని వేసి కలిపితే కరకరలాడే పాస్తా రెడీ. 

చట్​పటా సోయా
కావాల్సినవి :
మీల్​మేకర్​ – ఒక కప్పు
వెల్లుల్లి – పది
చాట్ మసాలా, గరం మసాలా, జీలకర్ర పొడి, పసుపు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
కారం – రెండు టీస్పూన్లు
ఉప్పు – సరిపడా 
తయారీ : పాన్​లో నూనె వేడి చేసి, వెల్లుల్లి తరుగు వేగించాలి. కారం, పసుపు, చాట్ మసాలా, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి కలపాలి. అందులో మీల్​మేకర్​ వేసి కలపాలి. పది నిమిషాలు తక్కువ మంట మీద వేగించాలి. స్టౌ ఆపేశాక, కొత్తిమీర, ఉల్లిగడ్డ, చాట్​ మసాలా చల్లుకుని తింటే బాగుంటాయి. 

మసాలా చాయ్


కావాల్సినవి :
టీ పొడి – ఒక టీస్పూన్
పాలు – ఒక కప్పు
చక్కెర – ఒక టీస్పూన్
దాల్చిన చెక్క – ఒకటి 
అల్లం – ఒక టీస్పూన్
లవంగాలు – ఒక టీస్పూన్​ 
యాలకులు – నాలుగు
మిరియాలు – ఒక టీస్పూన్
బెల్లం – రెండు టీస్పూన్లు
నీళ్లు – రెండు కప్పులు
తయారీ : లవంగాలు, మిరియాలు, యాలకలు రోట్లో కచ్చాపచ్చాగా దంచాలి. గిన్నెలో నీళ్లు పోసి, అందులో దంచిన పొడితోపాటు దాల్చిన చెక్కని కూడా నీళ్లలో వేయాలి. ఆ నీళ్లు బాగా కాగాక, పాలు పోసి, టీ పొడి వేసి ఒక మాదిరి మంట మీద కాగబెట్టాలి. పది నిమిషాల తర్వాత టేస్టీ మసాలా చాయ్ రెడీ అవుతుంది. ఇది రెండు కప్పులకు సరిపోతుంది. 

చైనీస్ భేల్


కావాల్సినవి :
నీళ్లు – సరిపడా
నూనె, ఉప్పు – సరిపడా
నూడిల్స్ – రెండు కప్పులు
వెల్లుల్లి తరుగు – ఒక టీస్పూన్
ఉల్లిగడ్డ తరుగు – రెండు టీస్పూన్లు
క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ – ఒక్కోటి అర కప్పు చొప్పున
టొమాటో సాస్ – మూడు టేబుల్ స్పూన్లు
సోయాసాస్ – ఒక టేబుల్ స్పూన్
వెనిగర్​ – అర టీస్పూన్
షెజ్వాన్ చట్నీ – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ : ఒక పాన్​లో నీళ్లు పోసి కాగబెట్టాలి. అందులో ఒక టీస్పూన్ నూనె వేసి కలపాలి. అందులో నూడిల్స్ వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత వడకట్టాలి. మరో పాన్​లో నూనె వేడి చేసి అందులో నూడిల్స్ వేగించాలి. ఇంకొక పాన్​లో నూనె వేడి చేసి వెల్లుల్లి, ఉల్లిగడ్డ తరుగు, క్యారెట్, క్యాబేజీ, క్యాప్సికమ్ తరుగు వేగించాలి. ఉప్పు వేసి మూడు నిమిషాలు కలపాలి. టొమాటో సాస్, సోయాసాస్, వెనిగర్, షెజ్వాన్ చట్నీ వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని గిన్నెలోకి తీసుకుని, అందులో నూడిల్స్​ కలపాలి. చివరిగా కొత్తిమీర, స్ర్పింగ్ ఆనియన్ తరుగు చల్లాలి.       

రవ్వ మసాలా స్టిక్స్


కావాల్సినవి :
బొంబాయి రవ్వ – రెండు కప్పులు
నువ్వులు – అర టీస్పూన్
నూనె (వేడి చేసి) – రెండు టేబుల్ స్పూన్లు
నీళ్లు – సరిపడా
కారం, గరం మసాలా, నల్ల ఉప్పు – ఒక్కోటి అర టీస్పూన్ చొప్పున
తయారీ : బొంబాయి రవ్వని మిక్సీ పట్టి, మెత్తటి పిండిలా చేయాలి. ఒక గిన్నెలో బొంబాయి రవ్వ పిండి, నువ్వులు, వేడి నూనె వేసి కలపాలి. నీళ్లు పోసి ముద్దగా కలపాలి. ఆ తర్వాత కొంచెం పిండిని తీసుకుని చపాతీల్లా వత్తాలి. వాటిని స్టిక్స్​లా చాకుతో కోయాలి. ఒక పాన్​లో నూనె వేడి చేసి, అందులో స్టిక్స్​ వేసి వచ్చేంత వరకు వేగించాలి. ఒక గిన్నెలో కారం, గరం మసాలా, నల్ల ఉప్పు వేసి కలపాలి. లేదంటే హెర్బ్స్ పొడి, చాట్​ మసాలా, పసుపు వేసి కలపాలి. ఆ మిశ్రమంలో స్టిక్స్ వేసి బాగా కలపాలి. 

చికెన్ మోమోలు


కావాల్సినవి :
చికెన్ – పావు కిలో
చికెన్ ఫ్యాట్ లేదా వెన్న – అర కప్పు
అల్లం వెల్లుల్లి తరుగు – ఒక్కోటి టీస్పూన్​ చొప్పున
క్యాబేజీ, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి తరుగు – ఒక్కోటి అరకప్పు చొప్పున
కొత్తిమీర – కొద్దిగా
మిరియాల పొడి – అర టీస్పూన్
సోయాసాస్ – ఒక టీస్పూన్
ఉప్పు, నీళ్లు – సరిపడా
ఫ్లేవరింగ్ సాల్ట్ – చిటికెడు
మైదా – రెండు కప్పులు 
నూనె – రెండు టీస్పూన్లు

మోమో చట్నీ కోసం..
ఎండు మిర్చి – ఎనిమిది
అల్లం వెల్లుల్లి తరుగు, చక్కెర, నూనె, సోయాసాస్, వెనిగర్ లేదా నిమ్మరసం, ఉప్పు  – ఒక్కోటి టీస్పూన్​ చొప్పున
నీళ్లు – కొన్ని
తయారీ : చికెన్​, చికెన్​ ఫ్యాట్​ని కలిపి చాకుతో సన్నగా తరగాలి. అచ్చం ఖీమాలా అన్నమాట. ఆ ఖీమాలో అల్లం వెల్లుల్లి, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యాబేజీ, కొత్తిమీర తరుగు, సోయాసాస్, ఫ్లేవరింగ్ సాల్ట్, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ఒక గిన్నెలో మైదా, ఉప్పు వేసి నీళ్లు పోసి ముద్దగా కలపాలి. నూనె వేసి మరికాసేపు కలపాలి. దానిపై తడి బట్ట వేసి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఆ తర్వాత చపాతీల్లా వత్తాలి. వాటిని గ్లాస్​తో చిన్న చిన్న చపాతీల్లా చేయాలి. వీటిలో చికెన్ మిశ్రమం పెట్టి మోమోల్లా చేయాలి. ఇడ్లీ పాత్రలో చేసుకోవచ్చు. లేదంటే ఒక గిన్నెలో నీళ్లు పోసి, పైన జల్లెడ పెట్టి దానిమీద క్యాబేజీ ఆకులు పరవాలి. వాటి మీద మోమోలను పెట్టి, మూతపెట్టి స్టీమ్ మీద ఉడికించాలి. 

చట్నీ తయారీ : ఒక గిన్నెలో ఎండు మిర్చి వేసి, నీళ్లు పోసి ఉడికించి మిక్సీ పట్టాలి. ఒకపాన్​లో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి తరుగు వేగించాలి. అందులో మిర్చి పేస్ట్, చక్కెర, సోయాసాస్, వెనిగర్ లేదా నిమ్మరసం, ఉప్పు వేసి వేగించాలి. నీళ్లు పోసి మరిగేవరకు ఉడికించాలి. షెజ్వాన్​ చట్నీకి కూడా ఇదే ప్రాసెస్.