
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిధ్య వెస్టిండీస్ గట్టి పోటీనిస్తుంది. పటిష్టమైన కంగారూల జట్టును ఓడించినంత పని చేస్తోంది. బ్యాటింగ్ లో విఫలమైనా.. బ్యాటర్లు అద్భుతంగా రాణించడంతో తొలి టెస్టులో ఆస్టేలియాను కంగారు పెడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. క్రీజ్ లో వెబ్ స్టర్ (19), ట్రావిస్ హెడ్ (13) ఉన్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కు థర్డ్ అంపైర్ ఇస్తున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
క్యారీ కింద పెట్టినా ఔట్:
వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో షాయ్ హోప్ ఔట్ ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. బ్యూ వెబ్‌స్టర్ వేసిన బంతిని ఆడే క్రమంలో హోప్ బ్యాట్ ఇన్సైడ్ ఎడ్జ్‌లో తగిలి బంతి వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ ఎడమ వైపుకు వెళ్లింది. కష్ట తరమైన ఈ క్యాచ్ ను ఆసీస్ వికెట్ కీపర్ డైవ్ చేసి ఒంటి చేత్తో అందుకున్నాడు. అయితే బంతి గ్లోవ్ లో పడకుండా అంతకంటే ముందు నేలను తాకినట్లు రీప్లేలో అనిపించింది. అయితే థర్డ్ అంపైర్ మాత్రం ఔటిచ్చాడు.
Also Read : టీమిండియాలో నో ఛాన్స్.. రిటైర్మెంట్పై స్పందించిన పుజారా
అల్ట్రాఎడ్జ్ అయినా ఎల్బీడబ్ల్యూగా అవుట్:
వెస్టిండీస్ కెప్టెన్ రోస్టన్ చేజ్ తొలి ఇన్నింగ్స్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ కావడం తీవ్ర విమర్శలకు గురి చేస్తుంది. ఆసీస్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వేసిన 50వ ఓవర్లో చేజ్ బంతిని డిఫెన్స్ ఆడాడు. అయితే బంతి ప్యాడ్లను తాకడంతో ఆసీస్ ఆటగాళ్లు అప్పీల్ చేశారు. రీప్లేలో బాల్ బ్యాట్ కు తగిలినట్టు అల్ట్రాఎడ్జ్ లో చూపించింది. అయితే థర్డ్ అంపైర్ బ్యాట్, బంతి మధ్య గ్యాప్ ఉందని భావించి ఎల్బీడబ్ల్యూ అంటూ ఔటిచ్చాడు.
హెడ్ క్యాచ్ వివాదాస్పదం:
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తుండగా మరొక నిర్ణయం షాకింగ్ గా అనిపించింది. షమర్ జోసెఫ్ వేసిన బంతిని హెడ్ షాట్ ఆడదామని చూస్తే ఎడ్జ్ తీసుకొని వికెట్ కీపర్ హోప్ చేతుల్లోకి వెళ్ళింది. క్లీన్ క్యాచ్ అవునో కాదో అనే అనుమానంలో ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్ కు వదిలేశాడు. థర్డ్ అంపైర్ బాల్ చేతుల్లో పడిందో లేదో అని ఖచ్చితంగా చెప్పలేకపోయాడు. ఖచ్చితమైన ఆధారాలు లేవని నాటౌట్ గా ప్రకటించాడు. ఈ మూడు నిర్ణయాలు వెస్టిండీస్ కు ప్రతికూలంగా మారాయి. ఒకవేళ వెస్టిండీస్ ఈ టెస్టులో ఓడిపోతే అంపైర్ నిర్ణయాలే అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే 4 వికెట్ల నష్టానికి 57 పరుగులతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ 190 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకు ఆలౌట్ కావడంతో వెస్టిండీస్ కు తొలి ఇన్నింగ్స్ లో 10 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో రోజు హోప్ (48) రాణించగా కెప్టెన్ ఛేజ్ 44 పరుగులు చేసి పర్వాలేదనిపించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు వికెట్లుయి తీసుకున్నాడు. హేజల్ వుడ్, కమ్మిన్స్, వెబ్ స్టర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. లియోన్ కు ఒక వికెట్ దక్కింది.