
మేళ్లచెరువు (చింతలపాలెం): భూ భారతి అవగాహన సదస్సులో రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరి గింది. బుధవారం చింతలపాలెం మండల కేంద్రంలో అధికారులు భూ భారతి సదస్సును నిర్వహించారు. రైతు దొంగల నాగరాజు వెళ్లి తన వెంట తెచ్చుకున్న బాటిల్ లోని పెట్రోల్ ను మీద పోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు వెంటనే అలర్ట్ అయి రైతును పక్కకు తీసుకెళ్లారు. బాధితుడు నాగరాజు మాట్లాడుతూ దొండపాడు గ్రామ రెవెన్యూ 187, 290 సర్వే నంబర్లలో భూమి ని కొనుగోలు చేశానని, అది రికార్డుల్లో తన పేరున ఉన్నా రెవెన్యూ ఆఫీసర్లు మరొకరి పేరుపై బదిలీ చేశారని ఆరోపించాడు.
తన భూమి కబ్జాకు గురైందని చెప్పినా ఆఫీసర్లకు పట్టించుకోవడంలేదని, దీంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు బాధితుడు చెప్పాడు. అదే సదస్సులో మరో మహిళా రైతు కూడా పురుగుల మందు డబ్బాతో వచ్చి బెదిరించడంతో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆర్డీవోను కలెక్టర్ ఆదేశించారు. కాగా రికార్డుల్లో నాగరాజు పేరున భూమి లేదని, పొజిషన్ లో ఉన్నానని చెప్పడంతో నోటీసులు ఇచ్చినట్లు తహసీల్దార్ సురేందర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు భూమిని పరిశీలించి నివేదిక అందజేస్తామని తెలిపారు.