డ్రమ్ సీడర్ విధానంతో అధిక దిగుబడులు : వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల

డ్రమ్ సీడర్ విధానంతో అధిక దిగుబడులు : వ్యవసాయ శాఖ అధికారి విజయనిర్మల

నేలకొండపల్లి, వెలుగు: రైతులు వరి సాగులో డ్రమ్ సీడర్ విధానాన్ని అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.విజయ నిర్మల సూచించారు. నేలకొండపల్లి మండల కేంద్రంలోని భక్త రామదాసు సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో గురువారం రైతు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. రైతులు టెక్నాలజీని అందిపుచ్చుకొని తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించాలన్నారు. 

డ్రమ్​సీడర్ విధానంతో ఎకరానికి రూ.10వేలు నుంచి12 వేలు ఖర్చు తగ్గుతుందని చెప్పారు. వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ జె.హేమంత్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత సీజన్ కొంత ఆలస్యంగా ప్రారంభమైనందున రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడులు సాధించేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. డ్రమ్​సీడర్ విధానంలో సన్న రకం విత్తనాలను ఎకరానికి 8 నుంచి10 కేజీలు మాత్రమే విత్తుకోవాలన్నారు. లావు రకాలలో 10 నుండి 12 కేజీలకు మించి కూడదన్నారు. సొసైటీ అధ్యక్షుడు పాలడుగు పూర్ణచంద్రప్రసాద్, నిర్వాహకులు, జిల్లాలోని అధికారులు పాల్గొన్నారు.