- వనపర్తి జిల్లా ఎదుల మండల కేంద్రంలో ఘటన
- డెడ్ బాడీతో రోడ్డుపై బాధిత కుటుంబం ఆందోళన
- మృతుడి భార్య ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు
రేవల్లి/ఎదుల, వెలుగు: మినుము పంటను ధ్వంసం చేసి, ఆపై కేసు పెట్టడడంతో భయాందోళన చెందిన రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో జరిగింది. మృతుడి కుటుంబ సభ్యులు, అతని చిన్న తమ్ముడు మల్లయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎదుల మండల కేంద్రానికి చెందిన కొమ్ము ఆంజనేయులు(50), అంజనమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
కాగా.. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్ కింద ఎదుల రిజర్వాయర్ లో ఆంజనేయులకు చెందిన ఎకరంన్నర భూమి ముంపులో పోగా.. మరో10 కుంటలకు పరిహారం అందలేదు. మిగిలిన భూమిలో మినుము పంట వేశాడు. అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి రిజర్వాయర్ పనుల కాంట్రాక్టర్. కాగా మినుము పంటను టిప్పర్లతో ధ్వంసం చేయడంతో ఆంజనేయులు వెళ్లి శ్రీనివాస్ రెడ్డిని అడిగాడు.
దీంతో అతనికి భూమి లేదంటూ.. కేఎన్ఆర్ కంపెనీ సైట్ ఇన్ చార్జ్ శేఖర్ రెడ్డితో శ్రీనివాస్ రెడ్డి స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లయింట్ చేయించారు. ఆపై ఆంజనేయులు రెండో తమ్ముడికి కాల్ చేసి అంతు చూస్తామని బెదిరించారు. దీంతో భయాందోళన కు గురైన ఆంజనేయులు గురువారం రాత్రి గడ్డి మందు తాగాడు.
కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందారు. కాగా.. ఆంజనేయులు మృతికి కాంట్రాక్టర్ శ్రీనివాసరెడ్డి, కేఎన్ఆర్ కంపెనీ ఇన్ చార్జ్ శేఖర్ రెడ్డి కారణమని ఆదివారం ఎదుల మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద డెడ్ బాడీతో రోడ్డుపై బాధిత కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు ధర్నాకు దిగారు.
న్యాయం చేసి, నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వీరికి వనపర్తి బీసీ పొలిటికల్ జేఏసీ నేత రాచాల యుగేందర్ గౌడ్, జిల్లా సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జబ్బార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ తదితర నేతలు మద్దతు తెలిపారు. మృతుడి కుటుంబానికి పరిహారం ఇస్తామని కేఎన్ ఆర్ కంపెనీ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మృతుడి భార్య అంజనమ్మ ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు గోపాల్ పేట పోలీసులు తెలిపారు.
