వచ్చే వారం నుంచే రుణమాఫీ

వచ్చే వారం నుంచే రుణమాఫీ
  • పంద్రాగస్టులోపు పూర్తి చేయడమే లక్ష్యం​
  • గైడ్​లైన్స్​ రెడీ.. సీఎం దగ్గరికి ఫైల్
  • గ్రీన్​సిగ్నల్​ రాగానే ప్రక్రియ షురూ

హైదరాబాద్​, వెలుగు: రైతులకు పంట రుణమాఫీని వచ్చే వారం నుంచే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అవసరమైన నిధుల్లో మూడోవంతు ఫండ్స్​ను ఇప్పటికే  సమకూర్చుకున్నది. క్రాప్​లోన్ల మాఫీకి అవసరమైన గైడ్​లైన్స్​ కోసం ప్రతిపాదనలు కూడా రెడీ అయ్యాయి. మంత్రులు, ఉన్నతాధికారుల  నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నాకే  గైడ్​లైన్స్​ ఫైనల్​ చేశారు. ప్రస్తుతం రుణమాఫీ మార్గదర్శకాలకు సంబంధించిన ఫైల్​ సీఎం దగ్గరికి చేరింది.

ఒకటి, రెండు రోజుల్లోనే వీటికి ఆమోద ముద్ర వేసి రిలీజ్​ చేయనున్నారు. ఆగస్టు 15లోగా రూ. 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగానే పలు దఫాలుగా కొంత మొత్తం చొప్పున నిధులు రిలీజ్​ చేస్తూ  పంద్రాగస్టు కల్లా రుణమాఫీ ప్రక్రియను క్లోజ్​చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. దాదాపు రూ. 31 వేల కోట్ల పంట రుణాలు ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ప్రభుత్వం వేగంగా సమకూర్చుకుంటున్నది. ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లు రెడీ చేసి అందుబాటులో పెట్టుకున్నది. మిగిలిన రూ. 20 వేల కోట్లకుపైగా ఫండ్స్​ను సేకరించే పనిలో పడింది. టీజీఐఐసీ నుంచి ల్యాండ్​ బ్యాంక్ ను తనఖా పెట్టడం ద్వారా ఇంకో రూ. 10 వేల కోట్లు వస్తాయని అంచనా వేస్తున్నది.

మరో 10 వేల కోట్లు రుణాల రూపంలో తీసుకునేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. మొత్తంమీద  ఆగస్టు 15 వరకు మూడు నుంచి నాలుగు దఫాల్లో రైతుల పంట రుణాలను మాఫీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. వచ్చే వారంలో అంటే ఈ నెల 15 తర్వాత ఏ క్షణంలోనైనా రుణమాఫీని మొదలు పెట్టే అవకాశం ఉన్నదని సెక్రటేరియెట్​లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.  

గైడ్​లైన్స్​పై క్లారిటీ

క్రాప్​లోన్ల మాఫీకి సంబంధించి గత నెల 21న రాష్ట్ర కేబినెట్​ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కటాఫ్​ తేదీలను కూడా ప్రకటించారు. 2018 డిసెంబర్​ 12 నుంచి 2023 డిసెంబర్​ 9 వరకు ఉన్న పంట రుణాలన్నింటినీ మాఫీ చేయనున్నట్లు వెల్లడించారు. పంట రుణాల మాఫీకి సంబంధించి గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాలు అమలుచేసిన నిబంధనలపై చర్చించారు.

పీఎం కిసాన్​ స్కీమ్​ అర్హత కోసం అమలుచేస్తున్న గైడ్ లైన్స్​పై కూడా చర్చ జరిగింది. ఈ క్రమంలోనే రుణమాఫీ గైడ్​లైన్స్​పై ప్రభుత్వం ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చింది. అందులో భాగంగానే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాఫీ వర్తింపజేయకూడదని డిసైడ్​ అయింది. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులను కూడా రుణమాఫీ నుంచి మినహాయించనుంది. కుటుంబం యూనిట్​గా తీసుకోవడమా.. లేదంటే రైతు యూనిట్​గా తీసుకోవడమా అనే రెండు ఆప్షన్లను సీఎం రేవంత్​రెడ్డికి అధికారులు వదిలేశారు.