జగిత్యాల రైతు బజార్ వద్ద రైతుల ఆందోళన

జగిత్యాల రైతు బజార్ వద్ద రైతుల ఆందోళన

జగిత్యాల పాత బస్టాండ్ వద్ద రైతు బజార్‭లో ఆందోళన నెలకొంది. రైతుబజార్‭లో కూరగాయలు అమ్ముకునేందుకు స్థలం లేక రోడ్డుపైకి వస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై కూరగాయాలు విక్రయిస్తున్నారనే నెపంతో బల్దియా టౌన్ ప్లానింగ్ సిబ్బంది తమను వెళ్లగొడుతున్నారని నిరసనకు దిగారు. రైతుబజార్‭లో వ్యాపారస్తులే నిండిపోయారని.. తమకు స్థలం లేక ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. తమకు ఉదయం సమయంలోనైనా మార్కెట్‭లో స్థలం కేటాయించాలని మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

రైతుబజార్ లో స్థలం లేకపోవడంతో రోడ్డుపై అమ్ముకుంటున్నామని రైతులు వాపోయారు. ఉదయం 9గంటల వరకు మాత్రమే తాము కూరగాయలు అమ్ముకుంటున్నామని, ఆ సమయంలో కూడా మున్సిపల్ సిబ్బంది వచ్చి తమను అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుబజార్ లో స్థలం అయినా ఇప్పించాలని, లేని పక్షంలో రోడ్డుపై కూరగాయలు పెట్టి అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.