కల్లాల వద్దే 15 రోజులు .. అకాల వర్షాలతో అన్నదాతలకు తిప్పలు

కల్లాల వద్దే 15 రోజులు .. అకాల వర్షాలతో అన్నదాతలకు తిప్పలు
  • లారీలు రాక ఆగుతున్న కొనుగోళ్లు
  • ఇదే అదనుగా దోచుకుంటున్న దళారులు

కల్లూరు మండలం పుల్లయ్యబంజరకు చెందిన రైతు బి.శివరామకృష్ణ కొంత సొంత భూమి, మరికొంత కౌలుకు తీసుకొని 20 ఎకరాల్లో వరి సాగు చేశారు. పండిన ధాన్యాన్ని 30 రోజుల కింద శివాలయం ఆవరణలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, ఆరు రోజుల కింద 600 బస్తాలు కాంటా వేశారు. కానీ లారీలు రాకపోవడంతో ఆ బస్తాలకు ఇంకా తరలించలేదు. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి ధాన్యం తడవడంతో మళ్లీ ఎండబెట్టి, తూర్పార పడితేనే కాంటా వేస్తామని కొనుగోలు కేంద్రం నిర్వాహకులు చెప్పారు. దీంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ప్యాడీ క్లీనర్​ సాయంతో ధాన్యాన్ని తూర్పారబడుతున్నారు. ముదిగొండ మండలం గోకినేపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో అకాల వర్షాలతో ధాన్యం తడవడంతో మొలకెత్తాయి. 20 రోజులుగా ధాన్యాన్ని ఆరబెడుతున్నా ఇప్పటి వరకు కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. 

ఖమ్మం, వెలుగు :  ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాంటాలు కాకపోవడం, లారీలు రాకపోవడం వల్ల కాంటాలు వేసిన ధాన్యాన్ని తరలించకపోవడం లాంటి కారణాలతో కనీసం 15 నుంచి 20 రోజులకు పైగా కల్లాల్లో రైతులు పడిగాపులు కాస్తున్నారు. అదే సమయంలో కురుస్తున్న అకాల వర్షాలతో కాంటా వేసిన బస్తాలు కూడా తడుస్తున్నాయి. దీంతో బస్తాల్లోని ధాన్యాన్ని మళ్లీ ఎండబెట్టాల్సి వస్తోంది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం, మళ్లీ రాశులుగా పోగులు చేసుకోవడం, కొనుగోలుదారుల కోసం ఎదురు చూడటం రైతులకు పరిపాటిగా మారింది. 

అప్పటి వరకు ధాన్యం బస్తాలను దొంగల బారి నుంచి కాపాడుకునేందుకు, తడవకుండా చూసుకునేందుకు రాత్రి వేళ్లల్లో వంతులు వేసుకొని మరీ రైతు కుటుంబ సభ్యులు కాపలా ఉండాల్సి వస్తోంది. ధాన్యం తూర్పార పడితేనే కొనుగోలు చేస్తామంటూ మిల్లర్లు చెప్పడంతో తిరిగి మళ్లీ ధాన్యాన్ని యంత్రాల సహాయంతో తూర్పార పడుతున్నామని రైతులు చెబుతున్నారు.

 కాంటాలయ్యేందుకు రెండు వారాలు, ఆ తర్వాత బస్తాలను తరలించేందుకు మరో నాలుగైదు రోజులు.. ఇలా ఆలస్యం అవుతుండడంతో ఈ ఇబ్బందులు పడలేని రైతులు ప్రైవేట్ గా వ్యాపారులకు ధాన్యం అమ్ముకుంటున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు 2 కిలోల తరుగు కలుపుకొని 77 కేజీల ధాన్యం బస్తా రూ.1470కు కొనుగోలు చేస్తున్నారు. కొంతమంది రైతులు మిల్లర్లతో ముందుగా మాట్లాడుకున్న వారికి కింటాకు ఐదు కేజీలు పైగా తరుగు తీస్తూ నేరుగా కొనుగోలు చేపడుతున్నారని రైతులు చెబుతున్నారు.  

నిలువు దోపిడీ..!

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులను వివిధ పేర్లతో నిలువుదోపిడీ చేస్తున్నారు. కాంటా వేసినందుకు హమాలీలు, ధాన్యం తరలించేందుకు లారీ డ్రైవర్లు ముక్కు పిండి మరీ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. గతంలో 40 కేజీల ధాన్యం బస్తా కాంటా వేసినందుకు హమాలీలు రూ.20 చొప్పున తీసుకోగా, ఈ సీజన్​ లో రూ.25కు పెంచారు. కూసుమంచి మండలం పాలేరు కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన ధాన్యాన్ని తరలించేందుకు బస్తాకు రూ.2 చొప్పున రైతుల నుంచి వసూలు చేస్తున్నారు. 220 బస్తాల ధాన్యాన్ని కాంటా వేసిన రైతుకు కొనుగోలు కేంద్రంలో కనీసం రూ.6 వేల ఖర్చు అవుతోంది. కాంటా వేసినందుకు బస్తాకు రూ.25 చొప్పున రూ.5,500 హమాలీలు తీసుకుంటుండగా, బస్తాకు రూ.2 చొప్పున లారీ డ్రైవర్​ తీసుకుంటున్నారు. 

ట్రాన్స్​ పోర్ట్ కాంట్రాక్టర్​ కు ఒకవైపు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తున్నా, మళ్లీ రైతుల నుంచి వసూలు చేస్తుండడంపై అన్నదాతలు కోపానికి వస్తున్నా, అకాల వర్షాల పరిస్థితుల నేపథ్యంలో బస్తాలు తడుస్తాయేమోనన్న భయంతో డబ్బులిస్తున్నామంటున్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో గురువారం వరకు 225 కొనుగోలు కేంద్రాల్లో 7,834 మంది రైతుల నుంచి రూ.147.06 కోట్ల విలువైన 63,388 మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. వాటిలో రూ.94.14 కోట్లు రైతుల బ్యాంక్​ అకౌంట్లలో జమచేశామని అధికారులు చెబుతున్నారు. 

పది రోజులుగా కాంటా వేయట్లే

పది ఎకరాలలో సన్నాలు 200 బస్తాలు, దొడ్డు వడ్లు 100 బస్తాలు పండించాను. లంకాసాగర్ క్రాస్ రోడ్ లోని కొనుగోలు కేంద్రానికి పది రోజుల కింద తీసుకొచ్చి ఆరబెట్టాను. ఇంతవరకు కాంటా వేయలేదు. నాకంటే ముందు వచ్చిన ధాన్యం కాంటా వేసినా మిల్లుకు ఇంకా పంపలేదు. అవి మిల్లుకు పోతేనే మా ధాన్యం కాంటా వేస్తామంటున్నారు. బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారంతో వర్షానికి కప్పిన పట్టాలు లేచిపోయి ధాన్యం తడిసిపోయింది. కాంటా వేసిన వేరే రైతుల ధాన్యం బస్తాలు కూడా తడిసిపోయాయి. తడిసిన ధాన్యం కొంటారో లేదో అని భయంగా ఉంది.
-కాపు హరిబాబు, పెనుబల్లి మండలం 

కాంటాలు వేసి వారమైనా లారీ రాలే..

రెండెకరాల పొలంలో 70 బస్తాలు దొడ్డు ధాన్యం పండించాం. చౌడారం సొసైటీ కొనుగోలు కేంద్రానికి 10 రోజుల కింద తీసుకొచ్చి ఆరబెట్టి, వారం కింద కాంటా వేసాం. ఇప్పటి వరకు మిల్లుకు పంపేందుకు లారీ రాలేదు. కొనుగోలు కేంద్రంలో స్థలం లేక రోడ్ పైనే బస్తాలను ఉంచి కాపలా ఉంటున్నాం. బుధవారం రాత్రి వర్షానికి బస్తాలు తడిశాయి. బస్తాల్లో నుంచి వడ్లు తీసి ఆరబెడుతున్నాం. ప్రభుత్వం వడ్లను త్వరగా కొనాలి. 

రేగుల లక్ష్మి, వేంసూరు మండలం