
- ఆఫీసర్లపై గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్వాసితుల ఆగ్రహం
- ఎకరానికి రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్
ఖమ్మం టౌన్, వెలుగు: రైతులను భయపెట్టి ఆధార్ కార్డు, పట్టేదారు పాస్ పుస్తకాలు లాక్కున్నారని గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం సిటీలోని టెక్నికల్ట్రైనింగ్డెవలప్మెంట్సెంటర్(టీటీడీసీ)లో వైరా, కొణిజర్ల, చింతకాని మండలాల భూ నిర్వాసితులతో గురువారం అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే పరిహారం తీసుకోకపోతే కోర్టులో డిపాజిట్ చేస్తాం.. ఆ డబ్బు కోసం 25 ఏండ్లు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపెట్టారని ఆరోపించారు. ఎకరాకు ఎంత పరిహారం చెల్లిస్తారని ప్రశ్నించారు. ప్రస్తుతం గవర్నమెంట్రేట్రూ.24 లక్షల 40 వేలు ఉందని, ధరణి పోర్టల్‌లో రూ. 33 లక్షల 80 వేలు చూపిస్తోందన్నారు. బహిరంగ మార్కెట్ లో రూ. 70 లక్షలు పలుకుతోందన్నారు. ధరణిలో ఉన్న రేటుకు మూడింతలు పరిహారం చెల్లించాలని డిమాండ్‌చేశారు. డీపీఆర్‌ను ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా సర్వే చేశారని, ముందు సమస్యలు తీర్చి తర్వాతే రోడ్డు వేయాలని అన్నారు. న్యాయమైన పరిహారం ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఖమ్మంలోని కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి, రైల్వే బ్రిడ్జి కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు ధర ఎలా చెల్లించారో, అదే విధంగా ఇవ్వాలని కోరారు. గ్రీన్ ఫీల్డ్ హైవేకు రూ.4 వేల 600 కోట్లు కేటాయించారని, కానీ రైతులకు పరిహారం చెల్లించేందుకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ ఎకరాకు రూ.కోటి పలుకుతోందని ఎలా చెప్పారో, అదేవిధంగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఎకరాకు రూ. 25 లక్షలే ఇస్తాం
ఎకరాకు రూ. 25 లక్షలు మాత్రమే ప్రభుత్వం ఇస్తుందని అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ చెప్పారు. ఇది పీఎం ఆఫీస్ నుంచి జరుగుతున్న మీటింగ్.. దీన్ని మనం వ్యతిరేకించలేం అన్నారు. అవసరమైతే మరోసారి సర్వే చేస్తామని చెప్పారు. నిర్వాసితుల అభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. వైరా మున్సిపాలిటీ కావడంతో ధర ఎక్కువ అడుగుతున్నారని, ప్రభుత్వం మాత్రం అక్కడి రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చెల్లిస్తుందని చెప్పారు.