మిర్చి డబ్బులు ఎవరు ఇస్తారు?.. 18 లక్షలతో నేపాల్  ముఠా పరార్

మిర్చి డబ్బులు ఎవరు ఇస్తారు?.. 18 లక్షలతో నేపాల్  ముఠా పరార్

గద్వాల, వెలుగు: మిర్చి అమ్మిన డబ్బులు చేతికి అందక పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు శివారులోని రైతుమిత్ర కోల్డ్ స్టోరేజ్ లో చుట్టుపక్కల గ్రామాల రైతులు మిర్చి పంటను ఉంచారు. ఆ పంటను ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన నరసింహులు కొనుగోలు చేశాడు. వాటికి సంబంధించిన రూ.18 లక్షలను జూన్17న రాత్రి 9 గంటల ప్రాంతంలో కోల్డ్  స్టోరేజ్  సూపర్​వైజర్​కు అందజేసి రైతులకు ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోయాడు.

సూపర్ వైజర్ కు డబ్బులు ఇవ్వడం అక్కడ పని చేసే నేపాల్  ముఠాలోని నలుగురు వ్యక్తులు చూశారు. పథకం ప్రకారం అదే రోజు రాత్రి డబ్బులు దొంగతనం చేసి పరారయ్యారు. దీనిపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. సీసీ పుటేజీ పరిశీలించి నేపాల్​ ముఠా డబ్బులు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. నేపాల్​కు వెళ్లినా వారి ఆచూకీ లభించలేదని తెలిసింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఉండవెల్లి ఎస్ఐ బాలరాజు తెలిపారు.

డబ్బులు చేతికందక ఆందోళన

మిర్చి కొన్న వ్యాపారి కోల్డ్ స్టోరేజ్  సూపర్​వైజర్​కు డబ్బులు ఇచ్చి వెళ్లగా, ఆ డబ్బులు రైతులకు ముట్టలేదు. వాటిని నేపాల్  ముఠా ఎత్తుకెళ్లడంతో ఇప్పుడు రైతులకు డబ్బులు ఎవరిస్తారనే విషయం ప్రశ్నార్థకంగా మారింది. కోల్డ్ స్టోరేజీ వారి నిర్లక్ష్యంతోనే డబ్బులు చోరీ అయ్యాయని, వారే తమకు డబ్బులు ఇవ్వాలని రైతులు డిమాండ్  చేస్తున్నారు. కోల్డ్​ స్టోరేజీ వద్దకు వచ్చి తమకు డబ్బులు ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. పంటను కొనుగోలు చేసిన వ్యాపారి తాను డబ్బులు ఇచ్చానని, ఆ డబ్బులు చోరీకి గురైతే తానేం చేస్తానని చెబుతుండగా, అంత మొత్తం తానెలా చెల్లిస్తానని కోల్డ్​స్టోరేజీ నిర్వాహకులు చెబుతుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు నిందితులను గుర్తించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.