రైతు బిడ్డ నీరజ్ చోప్రా బరువు తగ్గి బంగారం తెచ్చిండు

రైతు బిడ్డ నీరజ్ చోప్రా బరువు తగ్గి బంగారం తెచ్చిండు

వెలుగు స్పోర్ట్స్‌‌ డెస్క్‌‌: బరువు తగ్గడం కోసం రన్నింగ్‌‌ ట్రాక్‌‌పై పరుగెత్తిన ఓ 13 ఏళ్ల పిల్లోడు.. పదేళ్ల తర్వాత ట్రాక్‌‌ అండ్ ఫీల్డ్‌‌లో ఇండియాకు  తొలి ఒలింపిక్‌‌ గోల్డ్‌‌ మెడల్‌‌ అందించాడు. కాస్త వింతగానే అనిపించినా.. గోల్డెన్‌‌ బాయ్‌‌ నీరజ్‌‌ చోప్రా కథ ఇది. హర్యానా రాష్ట్రంలోని ఖాంద్రా అనే గ్రామానికి చెందిన నీరజ్‌‌ చోప్రా అనుకోకుండా జావెలిన్‌‌ త్రో ఆటలో అడుగుపెట్టాడు.  ఓ సాధారణ రైతు కుటుంబానికి చెందిన నీరజ్‌‌.. చిన్నప్పుడు నెయ్యి, వెన్న చాలా ఇష్టంగా తినడం వల్ల 13 ఏళ్ల వయసులో 80 కిలోలు బరువు పెరిగి ఒబెసిటీ(ఊబకాయం)తో బాధపడ్డాడు. ఇరుగు పొరుగు, స్నేహితులు ఎగతాళి చేయడంతో  బరువు తగ్గేందుకు ఇష్టం లేకున్నా సరే తప్పనిసరి పరిస్థితుల్లో రన్నింగ్‌‌ స్టార్ట్‌‌ చేశాడు.  ఈ క్రమంలో అతని మామ భీమ్‌‌ చోప్రా.. 2011లో నీరజ్‌‌ను పానిపట్‌‌ స్పోర్ట్స్‌‌ స్టేడియంలోని జిమ్‌‌లో జాయిన్‌‌ చేశాడు.  జిమ్‌‌తో పాటు అక్కడే ఉన్న సాయ్‌‌ సెంటర్‌‌లోని రన్నింగ్‌‌ ట్రాక్‌‌లో చోప్రా రోజూ పరుగెత్తేవాడు. అక్కడే జావెలిన్‌‌ త్రో ..నీరజ్‌‌కు పరిచయమైంది. జావీర్‌‌( ప్రస్తుతం సాయ్‌‌ కోచ్)  అనే సీనియర్‌‌ అథ్లెట్‌‌  ఓ సారి నీరజ్‌‌ను జావెలిన్‌‌ విసరమన్నాడు. మొదట తటపటాయించిన అతను.. కాసేపటికి ఈటెను విసిరాడు. ఆ త్రోను చూసిన జావీర్‌‌.. నీరజ్‌‌లోని నేచురల్‌‌ టాలెంట్‌‌ను గుర్తించి ప్రోత్సహించాడు. ఇక, అక్కడి నుంచి(2011లో) జావెలిన్‌‌ త్రో ట్రెయినింగ్‌‌ స్టార్ట్‌‌ చేశాడు. 

వెంటాడిన అర్థిక ఇబ్బందులు.. గాయాలు

ఈ ఆటలో నెమ్మదిగా మెళకువలు నేర్చుకున్న నీరజ్‌‌.. రెండేళ్ల తర్వాత పంచకులకు ట్రెయినింగ్‌‌ బేస్‌‌ మార్చాడు. 2012 చివరికల్లా అండర్ –16 నేషనల్‌‌ చాంపియన్‌‌గా నిలిచిన  చోప్రా.. 2015లో నేషనల్‌‌ క్యాంప్‌‌ నుంచి పిలుపు వచ్చే వరకు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడ్డాడు. ట్రెయినింగ్‌‌ కిట్స్‌‌ సమకూర్చుకోలేక, మంచి డైట్‌‌ ఫాలో అయ్యే  స్థోమత లేక అవస్థలు పడ్డాడు. కానీ వ్యవసాయం ఆధారంగా బతికే అతని కుటుంబం అండగా నిలిచి నీరజ్‌‌ ముందుడుగు వేసేలా చేసింది. ఇక, 2015లో నేషనల్‌‌ క్యాంప్‌‌లో జాయిన్‌‌ అవ్వడంతో సమస్యలు తీరడంతోపాటు ట్రెయినింగ్‌‌ కూడా నెక్స్ట్‌‌ లెవెల్‌‌కు చేరింది. ఇక, 2016లో పోలాండ్‌‌లో జరిగిన ఈవెంట్‌‌లో అండర్–20 కేటగిరీలో రికార్డు క్రియేట్‌‌ చేయడంతో వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత కామన్వెల్త్‌‌, ఏషియన్‌‌ గేమ్స్‌‌, ఏషియన్‌‌ చాంపియన్స్‌‌షిప్స్‌‌లో గోల్డ్‌‌ మెడల్స్‌‌ సాధించి ఒక్కో మెట్టు ఎక్కుతూ టోక్యో ఒలింపిక్స్‌‌లో ఫేవరెట్‌‌గా బరిలోకి దిగాడు. అంతటితో ఆగకుండా గోల్డ్‌‌ మెడల్‌‌ గెలిచి చరిత్ర సృష్టించాడు. 100 మీటర్లకంటే ఎక్కువ దూరం ఈటెను విసిరిన ఏకైక త్రోయర్‌‌గా వరల్డ్‌‌ రికార్డు సొంతం చేసుకున్న జర్మనీ కోచ్​  ఉవె హోన్‌‌ (1986లో 104.80 మీటర్లు) కోచింగ్​లో మరింత రాటుదేలాడు.   అలాగని నీరజ్‌‌ జర్నీ సాఫీగా జరగలేదు. 2019లో కుడి మోచేతికి సర్జరీ చేయించుకున్న నీరజ్‌‌ ఏడాదికిపైగా ఆటకు దూరమయ్యాడు. అయిన రీఎంట్రీలో మహాద్భుతమే చేశాడు. నిజానికి రియో ఒలింపిక్స్‌‌లోనే నీరజ్‌‌ బరిలోకి దిగాల్సింది. కానీ దురదృష్టం అతని ఆశలకు అప్పట్లో బ్రేకులేసింది. 2016లో జరిగిన వరల్డ్‌‌ అథ్లెటిక్స్‌‌లో నీరజ్‌‌ సత్తా చాటాడు. కానీ  రియో గేమ్స్‌‌ క్వాలిఫికేషన్‌‌ గడువు ముగిసి అప్పటికే 12 రోజులు దాటడంతో చాన్స్‌‌ మిస్‌‌ అయ్యాడు.  అయినా పట్టుదలగా టోక్యోకు వచ్చి గోల్డ్​ మెడల్​తో హిస్టరీ క్రియేట్​ చేసిన నీరజ్​కు మంచి ఫ్యూచర్​ ఉంది.