ఈ విజయం భవిష్యత్‌ పోరాటాలకు దిక్సూచి

ఈ విజయం భవిష్యత్‌ పోరాటాలకు దిక్సూచి
  • అండగా ఉన్నోళ్లందరికీ థాంక్స్..
  • ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూ నేతలు 
  • ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌ బార్డర్‌‌లో రైతుల ముగింపు సభ

న్యూఢిల్లీ, వెలుగు: రైతుల ఐక్యతతోనే కేంద్ర ప్రభుత్వం 3 అగ్రి చట్టాలను రద్దు చేసిందని ఏఐకేఎస్‌, ఏఐఏడబ్ల్యూ నేతలు హన్నన్‌ మొల్లా, బి.వెంకట్‌ అన్నారు. ఇకపై కూడా ఇదే ఐక్యతతోనే కార్పొరేట్లను ఓడించగలమని, ఈ విజయం భవిష్యత్‌ పోరాటాలకు దిక్సూచిగా నిలుస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలోని షాజహాన్‌పూర్‌‌ సరిహద్దు వద్ద జరిగిన రైతుల ముగింపు సభలో వారు మాట్లాడారు. అమరవీరులకు నివాళులర్పించి, విజయోత్సవ సంబురాలు జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా శనివారం విజయోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. షాజహాన్‌పూర్‌‌ బార్డర్‌‌లో గత 13 నెలలుగా జరిగిన ఉద్యమాన్ని ముగించి, ఇంటికెళ్లిపోతున్నామని చెప్పారు. తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. షాజహాన్‌పూర్‌‌ రైతు వేదికను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం చాలాసార్లు చూసిందని, వారి ప్రయత్నాన్ని రైతులు ఐక్యంగా తిప్పికొట్టారన్నారు. కొన్నిసార్లు రైతుల టెంట్లను కూల్చేశారన్నారు. ఐక్యంగా పోరాడితే ఎంతటి నియంతలైన దిగిరాక తప్పదని ఈ పోరాటం రుజువు చేసిందన్నారు. ఈ పోరాటం ప్రపంచానికి అనుభవాలు 
నేర్పిందని పేర్కొన్నారు.