మిల్లర్లు అన్ లోడింగ్ చేసుకోకపోతే..  వడ్లు గోదాముల్లో దించండి : మంత్రి గంగుల

మిల్లర్లు అన్ లోడింగ్ చేసుకోకపోతే..  వడ్లు గోదాముల్లో దించండి :  మంత్రి గంగుల

 

  • మిల్లర్లు అన్ లోడింగ్ చేసుకోకపోతే..  వడ్లు గోదాముల్లో దించండి
  • రైతులు రోడ్లపైకి రాకుండా చూడండి ..  అధికారులకు మంత్రి గంగుల ఆదేశం 

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: మిల్లర్లు అన్ లోడింగ్ చేసుకోకపోతే ఇంటర్మీడియెట్‌‌‌‌ గోదాములు ఏర్పాటు చేసి వడ్లు దించుకోవాలని అధికారులను సివిల్‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌ మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ లోడింగ్ సమస్య రావొద్దని, రైతులు రోడ్లపైకి రాకుండా చూడాలన్నారు. బుధవారం సెక్రటేరియెట్ నుంచి కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో అక్కడక్కడ మిల్లర్లు అన్ లోడింగ్ చేసుకోవడం లేదని, ట్రాన్స్ పోర్టు సమస్యలు వస్తున్నాయని మంత్రి చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో తక్షణ పరిష్కారం కోసం ఇంటర్మీడియెట్ గోదాములు ఏర్పాటు చేయాలని సూచించారు. ఒకవేళ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అవకాశం లేకపోతే పక్క జిల్లాలో ఏర్పాటు చేయాలన్నారు. 

‘‘ఈ గోదాముల్లో వడ్లను దించాలి. ఆ ధాన్యంతో మిల్లర్లకు ఎలాంటి సంబంధం ఉండొద్దు. అధికారులే బాధ్యత తీసుకొని రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలి” అని ఆదేశించారు. ‘‘ప్రతిపక్షాల రాజకీయాలను పట్టించుకోవద్దు. రైతులకు ప్రయోజనం చేకూరేలా చూడాలి. తాలు, తరుగు సమస్యలు రావొద్దు. పక్క రాష్ట్రాల్లోని ధాన్యం రాష్ట్రానికి రాకుండా చర్యలు తీసుకోవాలి” అని సూచించారు. కాగా, ప్యాక్స్ గోదాములు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గోదాములు, రైతు వేదికలు, ప్రభుత్వ స్థలాల్లో ఇంటర్మీడియెట్ గోదాములు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్లు మంత్రికి చెప్పారు. ఇప్పటికే మెదక్ లో 30,700  టన్నులు, జగిత్యాలలో 52 వేల టన్నులు, సూర్యాపేటలో 40 వేల టన్నులతో గోదాములు ఏర్పాటు చేశామని తెలిపారు. సమావేశంలో సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్, కమిషనర్ అనిల్ కుమార్, జీఎంలు రాజిరెడ్డి, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

వరికోతల ఆలస్యంతోనే  అకాల వర్షాల ప్రభావం: మంత్రి నిరంజన్​రెడ్డి

యాసంగి  వరి పంట కోతల ఆలస్యం, అకాల వర్షాలతో  రైతులకే కాకుండా ప్రభుత్వానికి కూడా నష్టమేనని మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి అన్నారు. బుధవారం సెక్రటెరియెట్‌‌‌‌లో ఆయన అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. కాగా, సీఎం కేసీఆర్ గత కేబినెట్ సమావేశంలో  రైతులకు పంట నష్టం నివారణ సాధ్యాసాధ్యాల పరిశీలనకు మంత్రి వర్గ ఉపసంఘాన్ని నియమించారు. ఈ నేపథ్యంలో సబ్‌‌‌‌ కమిటీ తొలి సమావేశం బుధవారం జరింగింది. ఈ సందర్భంగా యాసంగి పంట కాలాన్ని ముందుకు జరిపేందుకు ఏ రకమైన విధానాలు అవలంబించాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని మంత్రివర్గ ఉపసంఘం అధికారులను కోరింది. యాసంగి సాగులో యాజమాన్య పద్ధతులు, తక్కువ కాలంలో  ఎక్కువ దిగుబడి ఇచ్చే వరి రకాల సాగు ఇతర అంశాలపై  శాస్త్రవేత్తలు, నిపుణులు, అధికారులతో మంత్రి వర్గ ఉప సంఘం చర్చించింది. వచ్చే సమావేశంలో మరింత లోతుగా అధ్యయనం చేసి సలహాలు, సూచనలు ఇవ్వాలని  అధికారులకు మంత్రులు సూచించారు.