రైతుల డిమాండ్లపై కేంద్రం హామీ పత్రం

రైతుల డిమాండ్లపై కేంద్రం హామీ పత్రం

అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు 15 నెలల క్రితం మొదలైన నిరసనలకు రైతు సంఘాలు ముగింపు పలికాయి. ఇప్పటికే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై కమిటీ వేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఉద్యమ సమయంలో రైతులపై పెట్టిన కేసులు తక్షణం ఎత్తేస్తామని కేంద్రం ప్రకటించింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలకు హామీ పత్రం పంపింది. నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి పరిహారం ఇచ్చే విషయంలో యూపీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాథమిక అంగీకారం తెలిపాయని ఆ హామీ పత్రంలో కేంద్రం తెలిపింది.

అగ్రి చట్టాల రద్దు తర్వాత ప్రధాన డిమాండ్లు అయిన కేసుల ఎత్తివేతకు అంగీకారం తెలపడం, నిరసనల్లో మరణించిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడంతో నిరసనలను పూర్తిగా ఉపసంహరించేందుకు రైతు సంఘాలు సిద్ధమయ్యాయి. దీంతో ఇన్నాళ్లుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న నిరసన క్యాంపులను రైతులు తొలగిస్తున్నారు. మొదటగా ఢిల్లీ, హర్యానా సరిహద్దులోని సింఘూ ప్రాంతంలో ఈ పనులు మొదలుపెట్టారు. తాము ఇంటికి పోయేందుకు సిద్ధమవుతున్నామని, అయితే ఈ విషయంలో తుది నిర్ణయం సంయుక్త కిసాన్ మోర్చా సంఘానిదే అని నిరసనల్లో పాల్గొన్న ఓ రైతు చెప్పారు.