ఆగని నకిలీలు.. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి నకలీ మందుల వ్యాపారం

ఆగని నకిలీలు.. రైతు ఫిర్యాదుతో వెలుగులోకి నకలీ మందుల వ్యాపారం

సంగారెడ్డి/సదాశివపేట, వెలుగు సంగారెడ్డి జిల్లాలో నకిలీ విత్తనాలు, ఎరువుల దందా ఆగడం లేదు.  కొందరు వ్యాపారులు పంటల సీజన్ మొదలు కాగానే విత్తనాలతో పాటు స్ప్రే చేసే మందులు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు.  వీటిని యథేచ్ఛగా ఫర్టిలైజర్ షాపుల్లోనే అమ్ముతూ రైతులను మోసం చేస్తున్నారు. సదాశివపేట మండలం ఆత్మకూరులో నకిలీ మందులు తయారు చేస్తూ ఉమ్మడి జిల్లాతో పాటు పక్క రాష్ట్రాలకు సప్లై చేస్తున్న ఓ వ్యాపారి మూడు రోజు కింద టాస్క్‌‌ఫోర్స్‌‌కు దొరికిపోయాడు. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో కలెక్టర్‌‌‌‌ శరత్ ఆదేశాల మేరకు పోలీసులు, అగ్రికల్చర్ ఆఫీసర్లు అలర్ట్‌‌ అయ్యారు.  సదాశివపేట, జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ ప్రాంతాల్లో ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు చేపట్టడంతో పాటు బార్డర్ చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచుతున్నారు. 

అక్రమ దందా ఇలా...

ఆత్మకూరు గ్రామంలో సెటిల్‌‌ అయిన ఉదయ్ జైన్ అనే వ్యాపారి శ్రీహలమ ట్రేడింగ్ కంపెనీ పేరుతో పెద్ద గోడౌన్ ఏర్పాటు చేసి విత్తనాలు, ఎరువుల దందా చేస్తున్నారు.  కాలం చెల్లిన మందులు, షాంపూలు, చిన్న పిల్లలు తినే స్నాక్స్‌‌తో  పురుగుల మందులు, ఎరువులు తయారు చేస్తూ డిస్కౌంట్ ఆఫర్లతో ఉమ్మడి జిల్లాతో పాటు కర్ణాటక, మహారాష్ట్రలోని ఫర్టిలైజర్ షాపులు, పలువురు ఏజెంట్లకు సప్లై చేస్తున్నాడు.  ఆత్మకూర్ గ్రామానికి చెందిన రైతు నీరడి నరేశ్‌‌ జైన్ వద్ద పురుగుల మందు కొని తన నాలుగున్నర ఎకరాల పత్తి పంటకు పిచికారీ చేశాడు. పంట మొత్తం పాడవగా పరిహారం ఇవ్వాలని ఆ వ్యాపారిని కోరాడు.  రేపుమాపు అంటూ తొమ్మిది నెలలుగా కాలయాపన చేస్తుండడంతో విసుగెత్తిన రైతు మూడు రోజుల కింద వ్యవసాయ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గోడౌన్‌‌పై దాడి చేసి పురుగుల మందులతో పాటు వాటి తయారీకి ఉపయోగించే సరుకులను స్వాధీనం చేసుకొని సదరు వ్యాపారిపై కేసు నమోదు చేశారు. 

ప్రభావిత ప్రాంతాలు ఇవే..

నకిలీ విత్తనాలు, ఎరువులు, స్ప్రే చేసే మందులు విషయంలో ఎక్కువగా జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాలు ప్రభావితం అవుతున్నారు. ఈ ప్రాంతాల్లో పత్తి సాగు ఎక్కువగా ఉండడం, మహారాష్ట్ర, కర్నాటక బార్డర్ ప్రాంతాలు కావడంతో వ్యాపారులు ఇక్కడి రైతులను టార్గెట్‌‌గా చేసుకుంటున్నారు. గతంలో టాస్క్‌‌ఫోర్స్‌‌ టీమ్‌‌ల దాడుల్లో ఎన్నోసార్లు నకిలీ విత్తనాలు బయటపడ్డాయి. ప్రమాదకర గడ్డి మందులు తయారు చేసి పట్టుబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి.  ఇప్పుడు కూడా ప్రభుత్వం టాస్క్‌‌ఫోర్స్‌‌ టీమ్‌‌లను ఏర్పాటు చేసినా ఫిర్యాదు చేస్తే తప్ప దాడులు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.  నిఘా పెంచి  నకిలీ ఎరువులు, 
విత్తనాలను అరికట్టాలని కోరుతున్నారు.