విశ్లేషణ: రైతుల రెక్కల కష్టం దళారుల పాలు

విశ్లేషణ: రైతుల రెక్కల కష్టం దళారుల పాలు

ఎండా వానలనక కష్ట నష్టాలకోర్చి పంట పండించి మార్కెట్​కు తీసుకువెళ్తున్న రైతును బయట దళారులు దగా చేస్తుండగా.. ప్రభుత్వ కొనుగోలు సెంటర్లలోనూ అన్యాయం జరుగుతోంది. ధాన్యం తడిసిందని, తాలు ఉన్నదని, క్వాలిటీ లేదని క్వింటాలుకు కిలోల కొద్దీ కోత పెట్టి.. దండుకున్న సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా బయటకొచ్చాయి. ఆయా జిల్లాల్లో మార్కెట్​ సిబ్బంది మిల్లర్లతో కుమ్మక్కై క్వాలిటీ లేదని కట్​చేసిన ధాన్యాన్ని బినామీ రైతుల పేరిట ప్రభుత్వానికే అమ్మి కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోళ్లలో అక్రమాలు జరగకుండా, దళారుల ప్రమేయం లేకుండా చూడాలి.

రాష్ట్రంలో 270 రెగ్యులేటెడ్ మార్కెట్లలో రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు. వీటిల్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ప్రకారం పంటలు కొనాల్సి ఉంది. కానీ మార్కెట్ వ్యవస్థ దళారీల అధీనంలో ఉండటం వల్ల రైతులకు మద్దతు ధర దక్కక నష్టం జరుగుతోంది. అన్నదాతలు పంటను మార్కెట్‌‌కు తీసుకువెళ్తే..  నాణ్యత ప్రమాణాల పేరుతో కొర్రీలు పెడుతున్న దళారులు, ఆ పంటను తక్కువ ధరకే కొని రైతుల రెక్కల కష్టం దోచుకుంటున్నారు. ఉదాహరణకు ఓ రైతు జిన్నింగ్​మిల్లుకు పత్తి తీసుకెళ్లగా.. దాన్ని పరిశీలించిన ఓ వ్యాపారి తేమ ఉందని, పింజా పొడవు లేదని, క్వాలిటీ లేదని ధర తగ్గించి అడుగుతాడు. చేను నుంచి మిల్లు దాకా తీసుకెళ్లిన రైతు ఆ పత్తిని మళ్లీ వాపస్​తీసుకొచ్చుకుని ఇంట్లో నిల్వ చేసుకునే వీలు లేదు కాబట్టి వ్యాపారి చెప్పిన ధరకే  అమ్మి ఇచ్చిన డబ్బులతో ఇంటికొస్తాడు. రైతు వద్ద తక్కువ ధరకే కొన్ని పత్తిని ఆ వ్యాపారి అదే జిన్నింగ్​మిల్లులో ఆ రోజు సాయంత్రమే ఓ బినామీ రైతు పేరిట ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముతాడు. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే రైతులను దగా చేస్తూ.. వేలకొద్ది దండుకుంటున్న దళారులు రాష్ట్రంలో అన్ని మార్కెట్లు, మిల్లుల్లో దర్జాగా కొనసాగుతున్నారు. వీరికి మిల్లు ఓనర్లు, ఆయా ఆఫీసర్లు, మార్కెట్​కమిటీలు పరోక్షంగా సహకరిస్తూ.. వారి వాటా వాళ్లు తీసుకుంటున్నారు. ఇదంతా ప్రత్యక్షంగా జరుగుతున్నా.. మార్కెటింగ్, వ్యవసాయ, సివిల్​సప్లయ్​శాఖ అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.

అధికార పార్టీల మద్దతు
వడ్లు, పత్తి, మొక్కజొన్న, సోయా, కందులు, పెసర్ల పంటలకు మద్దతు ధరలు దక్కక ఏటా తెలంగాణ రైతులు రూ.8 వేల కోట్ల మేర నష్టపోతున్నట్లు అంచనా. దీన్ని అడ్డుకోవడానికి మార్కెట్ కమిటీలు ముందుకు రావు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వారినే కమిటీల నామినేటెడ్​పోస్టుల్లో నియమిస్తున్నారు. దీంతో వాళ్లు ఏదో రకంగా దళారులకు మద్దతు ఇస్తూ.. రైతులను దోచుకునేందుకు సహకరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మార్కెట్లలో 22 వేల మంది వరకు ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరికి మార్కెట్ కమిటీలే జీత భత్యాలు ఇస్తున్నాయి. వ్యాపారుల నుంచి వసూలు చేసే1శాతం కమీషన్ నుంచి ఈ వేతనాలు చెల్లిస్తున్నారు. మార్కెట్​కు1శాతం కమీషన్ ఇచ్చే వ్యాపారులు అంతకు మించి రైతుల దగ్గర నుంచి(పంటల ధర తగ్గించడం ద్వారా) వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏటా340 నుంచి360 కోట్ల రూపాయల మార్కెట్ ఫీజు వస్తోంది. ఇందులో రూ. 280 కోట్లు జీత భత్యాల కింద పోతుండగా.. మిగిలిన రూ. 60 కోట్లు మార్కెట్లలో సౌకర్యాల కోసం  ఖర్చు చేస్తారు. అందులోనూ కమీషన్లు నడుస్తున్నాయి. ఇవీ గాక 37 రైతు బజార్లలో కూరగాయలు అమ్మకాలు సాగుతున్నాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి పన్ను కింద 45 నుంచి 60 కోట్లు ఆదాయం వస్తోంది. ప్రభుత్వం మొత్తం రాష్ట్ర మార్కెట్లకు ఏటా బడ్జెట్ నుంచి రూ. 6 కోట్లు మాత్రమే వ్యయం చేస్తోంది. మరో రూ. 6 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక వ్యయం కింద ఇస్తున్నారు. మార్కెట్ల నిర్వహణ మొత్తం పరోక్షంగా రైతులే భరిస్తున్నా వారికి మాత్రం నష్టమే జరుగుతోంది. 

క్వాలిటీ పేరుతో దోపిడీ
మార్కెట్లలో తక్కువ తూకం వేయడం, నాణ్యత, ప్రమాణాలను శాస్త్రీయంగా గుర్తించకపోవడం, శాంపిల్స్ పేరుతో క్వింటాళ్ల కొద్ది కాజేస్తూ.. రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారు. నిరుడు యాసంగి ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. క్వాలిటీ లేదని, తాలు ఉందని బస్తాల కొద్దీ వడ్లు కట్​చేసిన మార్కెట్​కమిటీలు, ఆ ధాన్యాన్ని మిల్లర్లతో కుమ్మక్కై బినామీ రైతు పేర్లతో ప్రభుత్వానికే అమ్మి రూ. కోట్లలో సంపాదించారు. ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, వరంగల్​ఆయా జిల్లాల్లో వీటిపై ఇంకా విచారణ నడుస్తోంది. గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. ఇలాంటి అక్రమాలతో రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. 

రైతులు జాగ్రత్తగా ఉండాలె
వానకాలం పంటలు ఇప్పుడిప్పుడే మార్కెట్ కు వస్తున్నాయి. ఈ సందర్భంగా రైతులు జాగ్రత్తగా ఉండాలి. దళారీలు, దోపిడీ దారులు రైతుల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దు. ప్రభుత్వ మద్దతు ధర కంటే తక్కువకు పంటను అమ్మొద్దు. అవసరమైతే రైతులంతా ఐక్యంగా పోరాడాలి. ఈ సీన్​లో 6,350 కొనుగోలు కేంద్రాలను తెరిచి వడ్లు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఇటీవల సీఎం ప్రకటించారు. కానీ మొక్కజొన్నలు, వేరుశనగ, సోయా, కందులు, పత్తి కొనడానికి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయించాలి.  కొన్ని చోట్ల దీపావళి తరువాత కొనుగోలు చేస్తామని వాయిదాలు పెడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మార్కెట్ ప్రణాళికను రూపొందించి రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. విజిలెన్స్ శాఖను అప్రమత్తం చేసి  మార్కెట్లలో జరుగుతున్న అవినీతిని ఎప్పటికప్పుడు అరికట్టాలి. అప్పుడే రైతుకు న్యాయం జరుగుతుంది. 

- సారంపల్లి మల్లారెడ్డి, ఏఐకేఎస్ ఉపాధ్యక్షులు