కరెంట్​ కోతలపై రోడ్డెక్కిన రైతులు .. జడ్చర్ల‌‌‌‌‌‌‌‌ కల్వకుర్తి హైవే దిగ్బంధం

కరెంట్​ కోతలపై రోడ్డెక్కిన రైతులు .. జడ్చర్ల‌‌‌‌‌‌‌‌  కల్వకుర్తి హైవే దిగ్బంధం
  • కామారెడ్డి జిల్లాలోసబ్​స్టేషన్ల ముట్టడి
  • 8 గంటల కరెంట్ కూడాఇవ్వడం లేదని సర్కార్​పై ఫైర్

జడ్చర్ల/కామారెడ్డి టౌన్/భిక్కనూరు, వెలుగు: రాష్ట్రంలో కరెంట్​ కోతలకు నిరసనగా శనివారం పలుచోట్ల రైతులు రోడ్డెక్కారు. అసలే వర్షాలు లేక పంటలు ఎండిపోతుంటే, కరెంట్ కోతల వల్ల మరింత నష్టం జరుగుతోందని వాపోయారు. మహబూబ్​నగర్​​జిల్లా జడ్చర్ల మండలం గంగాపూర్​కు చెందిన రైతులు జడ్చర్ల–-కల్వకుర్తి హైవేపై రాస్తారోకో చేశారు. దీంతో గంటపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ‘‘వ్యవసాయానికి 24 గంటలు కరెంట్​ఇస్తున్నామని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. 

కానీ  8 గంటలు కూడా ఇస్తలేరు. కొన్ని రోజులుగా రాత్రి పూట కరెంట్​ పూర్తిగా ఎత్తివేశారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయి” అని ఆవేదన వ్యక్తం చేశారు. అసలే వర్షాలు పడక ఇబ్బంది పడుతుంటే, కరెంట్​కోతలు విధించడం ఏమిటని ప్రశ్నించారు. కోతలు లేకుండా కరెంట్ సప్లై చేయాలని డిమాండ్ చేశారు. హైవేపై రెండువైపులా కిలోమీటర్ మేర వెహికల్స్ నిలిచిపోవడంతో పోలీసులు చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. 

కామారెడ్డిలో రెండు చోట్ల.. 

వ్యవసాయానికి 24 గంటల కరెంట్​ సప్లయ్​చేయాలని డిమాండ్​చేస్తూ కామారెడ్డి జిల్లాలో రెండుచోట్ల రైతులు సబ్ స్టేషన్లను ముట్టడించారు. భిక్కనూరు మండలం భాగర్తిపల్లిలో సబ్ స్టేషన్ వద్ద రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఓవైపు వర్షాల్లేక, మరోవైపు సరైన కరెంట్​సప్లయ్​లేక వరి ఎండిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను స్థానిక ఏఈ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఆఫీసర్లు చొరవ తీసుకొని 24 గంటల కరెంట్​సప్లయ్​చేయాలని డిమాండ్​చేశారు. అలాగే కామారెడ్డి మండలం నర్సన్నపల్లి సబ్​స్టేషన్​వద్ద నర్సన్నపల్లి, పాతరాజంపేట, కొటాల్​పల్లికి చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. ‘‘24 గంటల కరెంట్​ఇస్తామని చెప్పిన ప్రభుత్వం.. కనీసం 8 గంటలు కూడా ఇవ్వడం లేదు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం” అని హెచ్చరించారు.