వేధిస్తున్న యూరియా కొరత.. నోస్టాక్​ బోర్డులు​

వేధిస్తున్న యూరియా కొరత.. నోస్టాక్​ బోర్డులు​
  •    యూరియా  కోసం ఎగబడుతున్నరు 
  •     ఉన్న చోట యూరియాతో పాటు ఇంకొకటి అంటగడుతున్న వైనం
  •     సింగిల్​ విండోల చుట్టూ  రైతుల చక్కర్లు

నాగర్​ కర్నూల్​.వెలుగు :  జిల్లాలో అన్నదాతలను యూరియా కొరత వేధిస్తున్నది. వానాకాలం సీజన్​లో  ఆలస్యంగా వర్షాలు కురవడంతో పంటలు వేసుకోవడం లేటయింది. అయితే పంట ఎదిగే దశలో వానలు పడడంతో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం, బుధవారాల్లో నాగర్​ కర్నూల్, బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, ఉప్పునుంతల, కల్వకుర్తి, లింగాల, వంగూరు, చారకొండ, కొల్లాపూర్​ మండలాల్లో రైతులు యూరియా కోసం సింగిల్​ విండో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. యూరియా దొరకడం లేదన్న వార్తలు వినిపిస్తుండడంతో రైతులు ఉదయం 7గంటలకే షాపుల వద్దకు చేరుకుంటున్నారు. 

1.50లక్షల ఎకరాల్లో వరి సాగు 

నాగర్​ కర్నూల్​ జిల్లాలో వానాకాలం సీజన్​లో 1.20లక్షల ఎకరాల్లో వరిసాగు అవుతుందని అంచనా వేశారు.దాదాపు 30వేల ఎకరాలు అదనంగా సుమారు 1.50లక్షల ఎకరాల్లో వరి సాగయింది. ఇటీవల వర్షాలు పడటంతో రైతులు యూరియా కోసం ఆపసోపాలు పడుతున్నారు. వేరు సెనగ పంటకు యూరియా అవసరం ఉంటుందని ముందుగానే కొనిపెట్టుకోవడానికి రైతులు ఆరాటపడుతున్నారు. జిల్లాలోని ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్​ షాప్స్​లో యూరియా స్టాక్​ లేదని సమాచారం. ఉన్న షాపుల్లో యూరియాతో పాటు ఇతర మందులు కొంటేనే ఇస్తామని యజమానుల  చెప్పడంతో రైతులు బేజారు అవుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలో 3.15 లక్షల ఎకరాల్లో   సాగు 

 మహబూబ్ నగర్ జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో  3,15,428 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. జిల్లాకు సెప్టెంబరు కోటా కింద 5 వేల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. కానీ, బుధవారం నాటికి 1,400  మెట్రిక్ టన్నుల స్టాక్ మాత్రమే ఉంది. వరి, పత్తి, మక్క,  జొన్న రైతులు ఒకేసారి యూరియా కోసం వస్తుండటంతో కొరత ఏర్పడుతోందని అగ్రికల్చర్ ఆఫీసర్లు 
చెబుతున్నారు.

మార్క్​ఫెడే దిక్కు..

మార్క్​ఫెడ్​ సంస్థ ద్వారా జిల్లాలోని సింగిల్​ విండోల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నారు. కొన్ని పీఏసీఎస్​లు యూరియా సప్లై చేస్తున్నాయి.  అయితే చాలా చోట్ల స్టాక్​ లేదనే సమాచారం వస్తోంది. అగ్రోస్​ కేంద్రాలకు సరఫరా పెంచుతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నా ఆచరణలో ఇది అమలు కావడం లేదు. బిజినేపల్లి పీఏసీఎస్​లో స్టాక్​ ఉన్నా మిషన్​ పనిచేయడం లేదని చెప్పి రైతులను వాపస్​ పంపిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. బుధవారం నాగర్​ కర్నూల్​ పీఏసీఎస్ ముందు రైతులు క్యూ కట్టారు.

అందరికీ యూరియా ఇస్తామని సింగిల్​విండో అధికారులు చెప్తున్నా రైతులు శాంతించడం లేదు. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్​ వంటి  ప్రాంతాల్లో సింగిల్​విండోలు చేతులెత్తేశాయని రైతులు ఆరోపిస్తున్నారు.​  ఎప్పుడు అడిగినా రెండు, మూడు రోజులు అంటూ దాటేస్తున్నారని మండిపడుతున్నారు. పంటలను బతికించుకోవడానికి తాము తిప్పలు పడుతుంటే రేపు మాపు అంటూ ఎన్ని రోజులు తిప్పుతారని  అధికారులను రైతులు నిలదీస్తున్నారు.

కొరత రానియ్యం ...

ఈ వానాకాలంలో జిల్లాలో వరి సాగు అంచనాలకు మించి సాగైంది. ప్రస్తుతం జిల్లాలో 40 వేల బ్యాగుల యూరియా స్టాక్​ ఉంది. మార్క్​ఫెడ్​ నుంచి రోజు 4 వేల బస్తాల యూరియా వస్తోంది.ఈ నెలలో మరో 30 వేల బస్తాల  వరకు వస్తుంది. రెండు మూడు రోజుల్లో అంతా సర్దుకుంటుంది.యూరియా షార్టేజ్​ అనే వార్తలతో ముందుగానే కొనిపెట్టుకోవడానికి రైతులు ఒక్కసారిగా వస్తున్నారు.యూరియా దొరకదనే సమస్యే ఉండదు. రైతులు ధైర్యంగా ఉండాలి. 

 శివ..అగ్రికల్చర్​ ఆఫీసర్​