-
కొడవళ్లు, గొడ్డళ్లతోనూ దాడులు
-
10 మందికి గాయాలు
-
దవాఖానాకు తీసుకెళ్తే అక్కడా గొడవే...
నాగర్కర్నూల్, వెలుగు: పోడు భూముల సర్వే రెండు గ్రామాల మధ్య చిచ్చురేపింది. భూములు తమవంటే తమవని శుక్రవారం కొల్లాపూర్ మండలం నార్లాపూర్, కుడికిళ్ల గ్రామాల రైతులు దాడులు చేసుకున్నారు. కారంపొడి చల్లుకుంటూ కట్టెలు, కొడవళ్లు, గొడ్డళ్లతో దాడులు చేసుకోగా రెండు గ్రామాలకు చెందిన దాదాపు 10 మంది రైతులు గాయపడ్డారు. వీరిని కొల్లాపూర్ దవాఖానాకు తరలించగా, అక్కడ కూడా కొట్టుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులోని సర్వే నెం.36లో 52 ఎకరాల అటవీభూమి ఉంది. ఈ భూములను కుడికిళ్ల రైతులు 30 ఏండ్లుగా సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించి ఫారెస్ట్, రెవెన్యూ సిబ్బందితో సర్వేకు ఆదేశించింది. అయితే ఈ భూములు తమ గ్రామ పరిధిలో ఉన్నాయని, తమ తాతలు చెట్లు కొట్టి శుభ్రం చేస్తే కుడికిళ్ల రైతులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని నార్లాపూర్ రైతులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సర్వేకు వచ్చిన ఫారెస్ట్ సిబ్బందిని అడ్డుకున్న రెండు గ్రామాల రైతులు ఈ భూములు తమవంటే తమవంటూ ఘర్షణకు దిగి కొట్టుకున్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని కొల్లాపూర్ ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అక్కడ మరోసారి ఘర్షణ పడ్డారు. చెట్ల కొమ్మలు విరిచి మరీ కొట్టుకున్నారు. పరామర్శించడానికి వచ్చిన నార్లాపూర్ సర్పంచ్ భర్త వెంకటస్వామిపైనా దాడికి ప్రయత్నించారు. రెండు గ్రామాల రైతులు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
