
విత్తనాల కోసం పక్క రాష్ట్రాలకు
కర్నాటక నుంచి కందులు, సోయా
మహారాష్ట్ర నుంచి కాటన్ సీడ్స్ కొంటున్నరు
ధరలు తక్కువ కావడంతో తెప్పించుకుంటున్న మన రైతులు
అక్కడ విత్తనాలపై సబ్సిడీ అమలు
హైదరాబాద్, వెలుగు : విత్తనాల కోసం మన రాష్ట్ర రైతులు పక్క రాష్ట్రాల బాట పడుతున్నరు. కొన్ని రకాలైన విత్తనాలు రాష్ట్రంలో దొరకక, మరికొన్ని రకాల విత్తనాలు పక్క రాష్ట్రాల్లో సబ్సిడీ ధరకు దొరుకుతుండడంతో సరిహద్దు జిల్లాల రైతులు విత్తనాల కోసం ఆయా రాష్ట్రాలను ఆశ్రయిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్రంలో విత్తన ధరలు మండిపోతున్నాయి. రాష్ట్ర సర్కారు పచ్చిరొట్ట విత్తనాలు మినహా గత కొన్నేండ్లుగా సబ్సిడీతో విత్తన సరఫరా చేయకుండా చేతులెత్తేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాష్ట్ర రైతులు అగ్గువకు కొనేందుకు పక్క రాష్ట్రాల బాటపట్టాల్సి వస్తున్నది. పేరుకు విత్తన భాండాగారమని సర్కారు గొప్పలు చెబుతున్నా.. రైతులకు సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేయడం లేదు. దీంతో రైతులు పక్క రాష్ట్రాల వైపు చూస్తున్నారు.
సోయా విత్తనాల కోసం కర్నాటకకు క్యూ
రాష్ట్రంలో సోయా విత్తనాల కొరత నేపథ్యంలో సీడ్ కంపెనీలు భారీగా ధర పెట్టి బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోయా విత్తనాల కోసం రైతులు పక్క రాష్ట్రం కర్నాటకకు వెళ్తున్నారు. రాష్ట్రంలో సోయాబీన్ విత్తనాలు 30 కిలోల ధర రూ.3300 ఉండగా రూ.2300 వరకు అమ్ముతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న విత్తన కంపెనీనే రాష్ట్రంలో ఇలా విక్రయాలు చేస్తున్నది. ఇదే కంపెనీకి చెందిన విత్తనాలు పక్క రాష్ట్రం కర్నాటకలో 30 కిలోల సంచి రూ.1700కే దొరుకుతున్నది. దీంతో ఒక్కో సంచిపై రూ.600 వరకు గిట్టుబాటు అవుతుండడంతో సరిహద్దు జిల్లాల్లోని రైతులు కర్నాటక నుంచి పెద్ద ఎత్తున సోయా విత్తనాలు తెప్పించుకుంటున్నరు. ప్రధానంగా వికారాబాద్, జహీరాబాద్, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి జిల్లాల రైతులు ఆ రాష్ట్రాన్ని ఆశ్రయిస్తున్నారు. తమ బంధువుల పేరు మీద తక్కువ ధరకు కొని రాష్ట్రానికి తరలిస్తున్నరు.
ALSOREAD:సర్కారు ఇచ్చిన హామీ అమలుకు నోచుకోని మిడ్ డే మీల్స్ కార్మికులు
మహారాష్ట్ర నుంచి కాటన్ సీడ్స్
వానాకాలం సీజన్ లో 75 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ తాజాగా అంచనా వేసింది. ఎకరానికి రెండు కాటన్ సీడ్ ప్యాకెట్‌లు అవసరం అవుతాయి. 450 గ్రాములుండే ప్యాకెట్ ధర రూ.853గా ఉంది. బహిరంగ మార్కెట్‌లో కొందరు ధరను ఎక్కువకే అమ్ముతున్నారు. దీంతో సరిహద్దు జిల్లాలైన ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్ తదితర ప్రాంతాల రైతులు మహారాష్ట్ర బాట పడుతున్నరు. పత్తి విత్తనాలను లూజుగా అమ్మొద్దనే నిబంధనలు ఉన్నా అక్కడ దళారులు బస్తాల్లో పత్తి విత్తనాలు తెచ్చి కిలోల చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు బస్తాల్లో తెచ్చిన విత్తనాలను కంపెనీల పేర్లున్న ప్యాకెట్లలో ప్యాక్ చేసి బీటీ విత్తనాలుగా నమ్మించి విక్రయిస్తున్నారు. అలాంటి విత్తనాలను దళారుల నుంచి రైతులు కొనుక్కుని రాష్ట్రానికి తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా సోయా విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లా రైతులు చాలా మంది మహారాష్ట్రపైనే ఆధారపడుతున్నారు.