తెలంగాణలో యూరియా కొరత.. యూరియా కోసం రైతుల పడిగాపులు

తెలంగాణలో యూరియా కొరత.. యూరియా  కోసం రైతుల పడిగాపులు

  నేరేడుచర్ల(పాలకవీడు)/హాలియా/కొండమల్లేపల్లి/నల్గొండ అర్బన్, వెలుగు:ఉమ్మడి నల్లొండ జిల్లాలో యూరియా దొరకక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నాగార్జున సాగర్ కాల్వల ద్వారా నీళ్లు రాకపోవడంతో ప్రస్తుతం బోర్లు, బావుల కింద మాత్రమే వరి సాగు చేశారు. నాట్లు వేసి నెల రోజులు గడుస్తుండడంతో పొలాలకు సత్తువ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. ఇదే టైంలో యూరియాకు డిమాండ్​ పెరిగింది. గత మూడు రోజులుగా కోఆపరేటివ్​ సొసైటీలు, వ్యవసాయ సహకార సంఘం ఆఫీసుల వద్ద ఉదయం నుంచే రైతులు బారులు తీరుతున్నారు. 

నల్గొండ, సూర్యాపేట జిల్లాలోని వేర్వేరు మండలాల్లోని ఆఫీసుల వద్ద యూరియా కోసం శుక్రవారం కూడా క్యూ కట్టారు. ఒక్కో రైతుకు 20 నుంచి 30 బస్తాలు అవసరం ఉండగా, కేవలం ఒకటి నుంచి ఐదు బస్తాలు మాత్రమే ఇస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదాంలో ఎన్ని కట్టలు ఉన్నాయో చూపించాలని డిమాండ్ చేశారు. యూరియా సరఫరాలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. 

కొండమల్లేపల్లిలో 300 మందికి గాను కేవలం వంద మంది రైతులకు మాత్రమే యూరియా దొరికింది. నాలుగు లారీలకు గాను ఒక్క లోడే వచ్చిందని, మిగిలిన మూడు రాగానే ఇస్తామని అధికారులు చెప్పడంతో రైతులు ఉసూరుమంటూ వెనుదిరిగారు. బయట మార్కెట్​లోనూ యూరియా దొరకట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు.