ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేతపై రైతుల ఆందోళన

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పత్తి కొనుగోళ్లు నిలిపివేతపై రైతుల ఆందోళన

మహబూబ్ నగర్ రూరల్/అలంపూర్/గద్వాల, వెలుగు: తెలంగాణ కాటన్  అసోసియేషన్  నిరవధిక బంద్​లో భాగంగా సోమవారం పత్తి కొనుగోళ్లు నిలిపివేయగా, ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. మహబూబ్​నగర్​ రూరల్  మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులోని బాలాజీ కాటన్  ఇండస్ట్రీస్ లో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. 

ఆగ్రహించిన రైతులు రాయిచూర్  హైవేపై రాస్తారోకో చేశారు. యాప్ లో బుక్  చేసుకొని సీసీఐ కొనుగోలు కేంద్రానికి పత్తి తీసుకొస్తే కొనుగోలు చేయకపోవడం సరైంది కాదన్నారు. వ్యవసాయ అధికారులు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, ట్రాక్టర్ కు రోజుకు రూ.4 వేల నుంచి రూ.5 వేల కిరాయి చెల్లించి నష్టపోతున్నామని తెలిపారు. ఘటనా స్థలానికి రూరల్  ఎస్సై విజయ్ కుమార్  చేరుకొని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. 

ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోళ్లు ఎలా నిలిపివేస్తారని ఉండవెల్లి మండలంలోని సీసీఐ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. జిన్నింగ్​ మిల్లుల బంద్​ విషయం తెలియని రైతులు కొనుగోలు కేంద్రానికి చేరుకున్న తరువాత, విషయం తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం స్లాట్  బుక్  చేసుకున్న రైతులు మార్కెటింగ్  ఆఫీసర్​ పుష్పమ్మను కలిసి తమ పత్తిని కొనుగోలు చేయాలని వేడుకున్నారు.

 విషయం తెలుసుకున్న అలంపూర్  ఎమ్మెల్యే విజయుడు రైతుల ఆందోళనపై స్పందించారు. కలెక్టర్, సీసీఐ అధికారులతో మాట్లాడి సోమవారం స్లాట్​ బుక్​ చేసుకున్న రైతుల పత్తి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే జోక్యంతో సాయంత్రం నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి.

గద్వాల కలెక్టరేట్ ముట్టడి..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమను మోసం చేస్తున్నాయని పత్తి రైతులు వాపోయారు. సోమవారం రైతులు పత్తి లోడ్​ వెహికల్స్​తో కలెక్టరేట్ ను ముట్టడించారు. వారం రోజుల కింద టోకెన్లు ఇచ్చిన అధికారులు, ఇప్పటివరకు పత్తి కొనుగోలు చేయడం లేదన్నారు. ఆఫీసర్ల నిర్లక్ష్యంతో తాము ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. పల్లయ్య, తులసీ గౌడ్, మునిస్వామి, రాజు, నరసింహులు పాల్గొన్నారు.