
నర్సంపేట/ బచ్చన్నపేట/ నల్లబెల్లి/ తొర్రూరు/ నెల్లికుదురు, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల యూరియా కోసం పలు పార్టీల ఆధ్వర్యంలో రైతులు రోడ్డెక్కారు. బుధవారం తెల్లవారుజాము నుంచే పీఏసీఎస్‌లు, యూరియా సరఫరా కేంద్రాల వద్ద రైతులు బారులు తీరారు. రైతులు పెద్ద సంఖ్యలో రావడం, బయోమెట్రిక్, టోకట్ల వారీగా అందజేస్తుండడంతో ఆలస్యమయ్యింది. దీంతో బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు రోడ్లపై ధర్నాకు దిగారు. రైతులకు పూర్తిస్థాయిలో త్వరగా యూరియా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తొర్రూరులో రెండు ఎకరాలకు ఒకే బస్తా కేటాయించారని ఓ రైతు అధికారి కాళ్లు మొక్కడంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, జనగామ జిల్లా బచ్చన్నపేట పీఏసీఎస్ గోదాముల ఎదుట సీపీఎం మండల కార్యదర్శి బెల్లకొండ వెంకటేశ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. యూరియా అందజేయడంతో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి సరిపడా యూరియా అందించకపోతే పోరాటం తప్పదని హెచ్చరించారు.