ఏనుమాముల మార్కెట్ ముందు రైతుల ధర్నా

ఏనుమాముల మార్కెట్ ముందు  రైతుల ధర్నా

వరంగల్ సిటీ, వెలుగు: తడిసిన మిర్చి పంట కొనుగోలు చేయాలంటూ వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన గేటు ఎదుట రైతులు ఆందోళనకు దిగారు. గురువారం ఉదయం రైతులు తీసుకువచ్చిన పత్తి, మిర్చి పంటలకు ధరలు నిర్ణయించారు. అయితే కాంటాలు కాకుండా కొంత సరుకు మార్కెట్లో ఉండిపోయింది. గురువారం మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా వర్షం కురవడంతో రైతులు తెచ్చిన పంటలు తడిసిపోయాయి.

ఈ తడిసిన బస్తాలను కొనుగోలు చేయబోమని వ్యాపారులు చెప్పడంతో రైతులు మార్కెట్ ప్రధాన గేటు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు రైతులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరకు తడిసిన మిర్చి బస్తాలు ఒక్కింటికి రెండు కిలోల చొప్పున తరుగు తీయాలని నిర్ణయించారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కొనుగోలుదారులు, రైతులకు మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిర్చారు.