కరెంట్ లేక పంటలు..ఎండిపోతున్నయ్

కరెంట్ లేక పంటలు..ఎండిపోతున్నయ్
  • నందిన్నె- ఉమిత్యాల సబ్ స్టేషన్  ముందు ధర్నా
  • గద్వాల - రాయచూర్ రోడ్డుపై బైఠాయింపు

గద్వాల/కేటీదొడ్డి, వెలుగు: కరెంట్ కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. రోజుకు కనీసం ఆరు గంటల కరెంట్​ కూడా రావడం లేదంటూ శనివారం ఉదయం జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండ లం నందిన్నె, ఉమిత్యాల సబ్ స్టేషన్ల ముందు రైతులు ధర్నా చేశారు. అలాగే గద్వాల–రాయచూరు రహదారిపైనా బైఠాయించి ఆందోళన చేశారు. పంటలు ఎండిపోతున్నాయని, తమకు ఆత్మహత్యలే శరణ్యమంటూ పురుగుమందు డబ్బాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. 

రైతులు మాట్లాడుతూ తమకు 24 గంటల కరెంటు రావడం లేదన్నారు. ఎనిమిది గంటలు కరెంటు సరఫరా చేస్తున్నా అందులో మూడు గంటలు కోతపెడుతున్నారని, దాంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు. కరెంటు కోసం సబ్ స్టేషన్ కి వెళితే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. చాలినంత కరెంటు లేకపోవడంతో నందిన్నె సబ్ స్టేషన్ పరిధిలో వందల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయని మండిపడ్డారు.  

24 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని ఫైరయ్యారు. రోడ్డుపై ధర్నా చేస్తున్న రైతులను పోలీసులు అడ్డుకొని సబ్ స్టేషన్ ముందు చేయాలని సూచించడంతో ఉమిత్యాలలో ఉన్న సబ్ స్టేషన్ వద్ద రైతులు నిరసన కొనసాగించారు. కరెంటు ఇబ్బందులు లేకుండా చూస్తామని అధికారులు ఫోన్ లో హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా  విరమించారు.