ఇథనాల్ ఫ్యాక్టరీతో రైతుల్లో అలజడి 

ఇథనాల్ ఫ్యాక్టరీతో రైతుల్లో అలజడి 
  • గుండంపల్లి వద్ద నిర్మాణానికి ఏర్పాట్లు
  • ముడి సరుకుగా వరి, మొక్కజొన్న 
  • పచ్చని పంట పొలాలకు కాలుష్య ముప్పు
  • ఆందోళన బాటలో అన్నదాతలు

నిర్మల్, వెలుగు: పచ్చని పంట పొలాలకు నెలువైన నిర్మల్ జిల్లాలోని దిలావర్​పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహారం చిచ్చుపెడుతోంది. దశాబ్దాల నుంచి ఈ గ్రామం వ్యవసాయంలో ముందు వరసలో నిలుస్తోంది. వరి, మొక్కజొన్నతో పాటు కూరగాయలు, వాణిజ్య పంటలను రైతులు ఇక్కడ పెద్ద ఎత్తున సాగు చేస్తుంటారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ పెద్ద మొత్తంలో దిగుబడులు సాధిస్తారు. వ్యవసాయమే ఆధారంగా పంట పొలాలను నమ్ముకుని జీవిస్తున్న గుండంపెల్లి గ్రామంలో ఓ ప్రైవేటు సంస్థ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటుచేసేందుకు ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమను ఏర్పాటు చేయొద్దంటూ రైతులు మొరపెట్టుకుంటున్నా.. యాజమాన్యం మాత్రం మొండి వైఖరితో ఫ్యాక్టరీని అక్కడే ఏర్పాటు చేస్తామని, ఎలాంటి కాలుష్య ముప్పు ఉండదంటూ వాదిస్తోంది.

మా గ్రామం వద్దే ఎందుకు?

హైదరాబాద్​కు చెందిన పీఎంకే ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గుండంపల్లి వద్ద దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తుండడం స్థానికంగా దుమారం రేపుతోంది. ఆ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే కాలుష్యం తమ ఆరోగ్యాలపై తీవ్ర ప్రభావం చూపడమే కాకుండా పంట పొలాలకు నష్టం కలిగిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే తమ పచ్చని పంట పొలాలు కాలుష్య కోరల్లో చిక్కుకుంటాయని, స్వచ్ఛమైన వాతావరణం ఉండదని భయపడుతున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇతర చోట్ల స్థలాలు అందుబాటులో ఉన్నప్పటికీ యాజమాన్యం మాత్రం తమ గ్రామం వద్దనే ఎందుకు ఏర్పాటు చేస్తుందో అంతుచిక్కడం లేదని రైతులు వాపోతున్నారు. ఆ  ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దంటూ రైతులు పలుమార్లు అటు యాజమాన్యానికి, ఇటు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారి నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. శనివారం దిలావర్పూర్ మండల కేంద్రంలో ఆందోళన చేశారు. పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని, యాజమాన్యం మొండికేస్తే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని ఆ గ్రామ రైతులు స్పష్టం చేస్తున్నారు.

కాలుష్యం ఉండదు: యాజమాన్యం

గుండంపల్లి వద్ద ఏర్పాటు చేయబోతున్న ఫ్యాక్టరీతో ఎలాంటి కాలుష్యం ముప్పు ఉండదని పీఎంకే సంస్థ వెల్లడిస్తోంది. జీరో పొల్యూషన్ పద్ధతిలో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నామని.. కేవలం మొక్కజొన్న, వరితోనే ఇథనాల్​ను తయారు చేయనున్నందున ఎలాంటి కాలుష్య సమస్య ఉండదంటున్నారు. పరిశ్రమ నిర్వహణ కారణంగా దుర్వాసన కూడా వెలువడదని యాజమాన్యం చెబుతోంది. ఆ ప్రాంతంలో సాగయ్యే మొక్కజొన్న, వరి పంటలను ప్రభుత్వ మద్దతు ధరకే తాము కొనుగోలు చేస్తామని కంపెనీ యాజమాన్యం వివరిస్తోంది. కాగా పరిశ్రమ నిర్వహణలో వెలువడే వ్యర్థాలను సేంద్రియ ఎరువుగా మార్చేందుకు ప్రత్యేక యూనిట్​ను ఏర్పాటు చేస్తామంటోంది. అయితే, కంపెనీ యాజమాన్యం చెప్పే మాటలను గడంపల్లి రైతులు నమ్మడంలేదు. ఒకవేళ కాలుష్యం వెలువడి ప్రజల ఆరోగ్యం దెబ్బతిని, పంటలు నాశనమైతే ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. గమ గ్రామంలో కంపెనీ ఏర్పాటుకు ససేమిరా అంటున్నారు.

ఫ్యాక్టరీని అడ్డుకుంటాం

ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుతో మా పంట పొలాలకు నష్టం జరుగుతుంది. కాలుష్య కారకాలు పంటలకు నష్టం చేస్తాయి. భూగర్భ జలాలు విషపూరితమవుతాయి. ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయొద్దని ఇప్పటికే అధికారులకు కంప్లైంట్ చేశాం. ఫ్యాక్టరీ ఏర్పాటును అడ్డుకుంటాం.

కొప్పుల శ్రీనివాస్, రైతు, గుండంపెల్లి