మామిడి పూత ఆలస్యం.. దిగుబడిపై రైతుల్లో దిగులు

మామిడి పూత ఆలస్యం.. దిగుబడిపై రైతుల్లో దిగులు
  •     వచ్చిన పూతను ఆపేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులు
  •     పూతను తొలిచేస్తున్న నల్లి, ఇతరత్రా పురుగులు  
  •     ఉమ్మడి జిల్లాలో 57 వేల ఎకరాల్లో మామిడి సాగు

భద్రాద్రికొత్తగూడెం/చండ్రుగొండ, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 57 వేల ఎకారల్లో మామిడి తోటలు ఉన్నాయి. సాధారణంగా డిసెంబర్​ నెలలలో మామిడి పూత వస్తుంది. కానీ ఈసారి జనవరిలో పూత రావడంతో దిగుబడిపై రైతుల్లో దిగులు మొదలైంది. దీనికి తోడు వచ్చిన పూతను పురుగులు ఆశిస్తుండడంతో మరింత ఆందోళన చెందుతున్నారు. పూతను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.

ఖమ్మం జిల్లాలో 45 వేల ఎకరాలలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  12 వేల ఎకరాలలో మామిడిని సాగు చేస్తున్నారు. జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, దమ్మపేట, ములకలపల్లి, భద్రాచలం, చర్ల, కొత్తగూడెం,లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, అశ్వాపురం, పాల్వంచ, సుజాతనగర్, బూర్గంపాడు, కరకగూడెం, మణుగూరు, పినపాక, టేకులపల్లి, ఇల్లెందు మండలాల్లో  మామిడి ఎక్కువగా సాగు అవుతోంది. బంగినపల్లి, కేసరి, తోతాపురి, హిమాయత్, చిన్న, పెద్ద రసాలు లాంటి పలు రకాలు సాగు చేస్తున్నారు. గతేడాది ఆశించిన  స్థాయిలో దిగుబడి రాక రైతులు ఆర్థికంగా నష్టపోయారు. ఈసారి కూడా ఆశలు ఆవిరవుతున్న పరిస్థితులే కనిపిస్తున్నాయని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

దఫాలుగా మందుల స్ర్పే..

మామిడిలో అరకొరగా పూసిన పూత ఆపేందుకు కొత్తగా పూత వచ్చేందుకు రైతులు అవస్థలు పడున్నారు. ఎకరానికి దాదాపు రూ. 40 వేలు పెట్టుబడి పెట్టి మూడు దఫాలుగా మందులు స్ప్రే చేస్తున్నారు. ఆశించిన స్థాయిలో  అనుకున్న టైమ్​కు పూత వస్తే ఎకరానికి 5 టన్నుల దిగుబడి లభిస్తుందని రైతులు చెబుతున్నారు. ఈసారి టన్ను దిగుబడి లభించడం కష్టమేనని వాపోతున్నారు.

కొరవడిన హార్టీ, అగ్రికల్చర్ ఆఫీసర్ల పర్యవేక్షణ.. 

పంటల సీజన్ లో రైతులకు సలహాలు సూచనలు ఇవ్వాల్సిన ఉద్యాన వన శాఖ(హార్టికల్చర్), అగ్రికల్చర్ ఆఫీసర్ల పర్యవేక్షణ కొరవడిందని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.  గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి మామిడిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలను వివరించి చైతన్య పర్చాలని కోరుతున్నారు.

ఈసారి అన్నీ సమస్యలే.. 

ఈసారి మామిడి సాగు రైతులకు అన్నీ సమస్యలే ఎదురవుతున్నయి. 20 ఎకరాలలో మామిడి సాగు చేస్తున్న. పూత ఆలస్యంగా వచ్చింది. ఆ కొద్దిపాటి పూతకు నల్లి పురుగు తగులుతోంది. ఇప్పటికే రూ.2 లక్షల మందులు కొట్టిన. ఆఫీసర్లు మామిడి రైతులకు అవగాహన కల్పించడంలో ఫెయిల్ అయిన్రు. ఈసారి  ఎకరాకు టన్ను దిగుబడి రావడం కూడా కష్టమే.    
- కృష్ణారెడ్డి, రైతు , చండ్రుగొండ