వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట

వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట
  • ఎక్కువ కాలం నీరు నిల్వ ఉండడంతో మురిగిపోతున్న మొలకలు
  • ఎత్తు ఎదగక కలుపుతీయలేని పరిస్థితి
  • వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంట 
  •  సర్కారు ఆదుకోవాలని బాధితుల వేడుకోలు 

మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు : పత్తి పంట సాగు చేసిన వేలాది మంది  రైతులు వరుస వర్షాలతో పరేషాన్​ అవుతున్నారు. వానాకాలం సీజన్ లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 7లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగవుతుందని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అయితే సంగారెడ్డి జిల్లాలో మాత్రమే దాదాపు పూర్తి స్థాయిలో పత్తి సాగు చేయగా, జులై మూడు వారంలో భారీ వర్షాలు కురవడంతో సిద్దిపేట, మెదక్ జిల్లాలో దాదాపు 50 శాతం వరకు మాత్రమే పత్తి సాగైంది. అయితే ఇందులో వేలాది ఎకరాలు ఇటీవల కురిసిన వర్షాలకు పాడయ్యాయి. పంట ఎదుగుదల ఆగిపోయింది. తెగుళ్ల సమస్య ఉంది. ఎక్కువ కాలం నీళ్లు నిల్వ ఉండడంతో మొలకలు మురిగిపోతున్నాయి. ముసురు కారణంగా కలుపుతీయలేని పరిస్థితి ఉండటంతో వేలాది ఎకరాలు బీడు భూములను తలపిస్తున్నాయి. మళ్లీ నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని ముసురుతో పత్తి పంటలపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బాధిత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

  • సంగారెడ్డి జిల్లాలో ఈసారి 3.99 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయనున్నట్టు వ్యవసాయ శాఖ అంచనా వేయగా, అదే స్థాయిలో పంట సాగు అయ్యింది. కానీ వర్షాల కారణంగా అందులో దాదాపు 73 వేల ఎకరాల్లో పత్తి పంట  నీట మునిగింది. 
  • సిద్దిపేట జిల్లాలో ఈసారి 5.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేయగా, వర్షాలు ఆటంకం కలిగించడంతో అందులో దాదాపు రెండు లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు అయ్యింది. కాగా గజ్వేల్, హుస్నాబాద్ డివిజన్ల పరిధిలో అత్యధికంగా పత్తి సాగు అవుతోంది. కానీ వర్షాల కారణంగా ఆశించిన స్థాయిలో పంటలు లేకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 
  • మెదక్​ జిల్లాలో ఈయేడు 92 వేల ఎకరాలలో పత్తి సాగు అవుతుందని ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ జులై నెలాఖరు నాటికి జిల్లా వ్యాప్తంగా 48,257 ఎకరాల్లోనే రైతులు పత్తి పంట సాగు చేశారు. అయితే ఆ పంట కూడా చాలా వరకు వర్షం కారణంగా దెబ్బతిన్నది.  

రెండుసార్లు నాటినా ఉత్తిదే అయ్యే.. 

ఈసారి వరుసగా కురిసిన వర్షాలతో పత్తి పంట సాగుకు మొదటి నుంచి ఇబ్బందులే కలిగాయి.  అధిక వర్షాలతో  తొలుత వేసిన విత్తులు మొలకలు రాకపోవడంతో చాలా మంది రైతులు మరోసారి విత్తనాలు వేశారు.  చివరికి అన్ని మొలకలు మొలిచినా ముసురు మళ్లీ ముంచింది. పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం ఉత్తిదే అయ్యిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటల స్థానంలో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చూసినా ఇప్పటికీ ముసురు ఇడవటం లేదు. దీంతో ఈసారి భారీగా నష్టపోయే పరిస్థితి నెలకొందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. 

పంటంతా మునిగింది

ఆరు ఎకరాల్లో పత్తి పంట వేస్తే 5 ఎకరాల్లో పంటంతా పాడైంది. వరుసగా వానాలు పడుతుండటంతో ఏం చేయలేని పరిస్థితి ఉంది. వానకు దెబ్బతిన్న  పంటలను సారోళ్లు వచ్చి చూసిన్రు.. సర్కారే మమ్మల్ని ఆదుకోవాలె. 

– శంకరయ్య, రైతు, మునిపల్లి