కూతుర్ని పూడ్చడానికెళ్తే.. గుంతలో పసికందు దొరికింది

కూతుర్ని పూడ్చడానికెళ్తే.. గుంతలో పసికందు దొరికింది

మట్టి కుండలో దొరికిందని సీత అని పేరు పెట్టి.. ఆసుపత్రిలో చికిత్స

బరేలీ: చనిపోయిన పసికందును పూడ్చడానికి స్మశానానికి వెళ్తే.. అక్కడ మట్టి కుండలో మరో శిశువు దొరికింది ఓ తండ్రికి. ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఈ ఘటన జరిగింది.

నెలలు నిండకముందే పుట్టిన కూతురు.. పుట్టిన కొద్ది క్షణాలకే.. పొత్తిళ్లలో ప్రాణాలు విడిచింది. అపురూపంగా చూసుకుందామనుకున్న బిడ్డ కన్నమూయడంతో కన్నీరు మున్నీరయ్యారా తల్లిదండ్రులు. పేగు తెంచుకుని పెట్టిన బిడ్డ అంతలో తనను వదిలిపోతోందని కన్నతల్లి విలపించింది. గుండెల్లో పెట్టుకుని పెంచుకుందామనుకున్న తండ్రి తన చేతులతో అంతిమ సంస్కారాలు చేసేందుకు తీసుకెళ్లాడు. విషాదంగా స్మశానం చేరుకున్నారు.

ఆ పసికందు మృతదేహాన్ని పూడ్చిపెడదామని బంధువులు గుంత తీస్తుంటే.. ఓ మట్టి కుండ తగిలింది. అందులో నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దాన్ని బయటకు తీసి చూస్తే కొన్ని గంటల ముందే పుట్టిన పసిపాప అందులో ఉంది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ చిన్నారిని పూడ్చేసి వెళ్లారని అర్థమైంది.

చేతిలో ఉన్న చనిపోయిన బిడ్డని పక్కన పెట్టి.. ఆ పాపను ఆర్తిగా ఎత్తుకున్నాడా తండ్రి. వెంటనే అంబులెన్స్ పిలిపించి.. ఆస్పత్రికి పంపారు. తన బిడ్డ అంత్యక్రియలు పూర్తి చేసి ఆస్పత్రికి వెళ్లారు. పోలీసులకు కూడా సమాచారమిచ్చారు. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. కనికరం లేకుండా పసికందును పూడ్చిపెట్టిన వారిని శిక్షిస్తామని చెప్పారు.

మట్టిలో దొరికిందని సీత పేరు

ఆస్పత్రిలో ఆ చిన్నారికి చికిత్స చేస్తున్నారు. మట్టిలో దొరికిందని ఆ పాపకు సీత అని పేరు పెట్టారు ఆస్పత్రి సిబ్బంది. అయితే పసికందు కోలుకోవడం కష్టమని చెబుతున్నారు డాక్టర్లు. గుంటలో పెట్టి కొద్ది గంటలు దాటడంతో పరిస్థితి విషమంగా ఉందన్నారు.