
పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యేదాకా పిల్లలను తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకుంటారు. మంచి బుద్ధులు నేర్పిస్తారు. చదువు సంధ్యలు చెప్పిస్తారు. మొదటి గురువు తల్లిదండ్రులే. కానీ, తండ్రికే ఓ బిడ్డ గురువైంది. తండ్రికి సీనియర్ అయింది. చదువులో వచ్చే డౌట్లను చెబుతోంది. అర్థం కాలేదా.. ఒకే కాలేజీలో తండ్రి, కూతుళ్లు చదువుతున్నారు. బిడ్డ సీనియర్ అయితే, తండ్రి జూనియర్ మరి. ఆ తండ్రీ బిడ్డల స్టోరీని హ్యూమన్స్ ఆఫ్ బాంబే తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేసింది. ఆ పోస్టు సారాంశమిదీ…
‘‘మా నాన్నకు లా అన్నా, కోర్టులన్నా చాలా ఇష్టం. కేసులను వాదించడమంటే ఇంకా ఇష్టం. లా చదువుదామనుకున్నారు. కానీ, ఆయన వయసులో ఉన్నప్పుడు మా తాత వాళ్లకు చదివించే స్థోమత లేదు. ఉద్యోగంలో చేరి కుటుంబానికి చేదోడుగా ఉన్నారు. రాత్రింబవళ్లూ కష్టపడి పనిచేశారు. తన లాగా మేం కాకూడదని కష్టపడ్డారు. మా అక్కను డాక్టర్ చేశారు. నేను, మా తమ్ముడు ఇద్దరం లా చదువుతున్నాం. నేను పుస్తకం తీసినప్పుడల్లా అందులోని ప్రతి చిన్న విషయాన్నీ తెలుసుకోవాలన్న కుతూహలం ఆయనకు ఉండేది.
నా క్లాసుల గురించి అడిగేవారు. సబ్జెక్టుల గురించి తెలుసుకునేవారు. దీంతో మేం ఆయన్ను యూనివర్సిటీలో చేర్పించేలా ఒప్పించాం. ఇప్పుడు, నేను, నాన్న ఒకే కాలేజీలో చదువుతున్నాం. మా నాన్న నా జూనియర్. ఇద్దరం కలిసి ఎంతో ఎంజాయ్ చేస్తాం. మా ప్రొఫెసర్లు, క్లాస్మేట్లు, అసైన్మెంట్ల గురించి చర్చించుకుంటాం. లంచ్ బ్రేక్‌లో నా స్నేహితులతో కలిసి కూర్చుంటాం. వాళ్లూ మా నాన్న అంటే ఇష్టపడతారు. ఆయన అనుకున్న దాంట్లో చేరినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నా” అని హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఆ తండ్రి, బిడ్డల స్టోరీని షేర్ చేసింది. బాంబేలో ఉంటున్న వాళ్ల వివరాలు మాత్రం తెలియచేయలేదు.