ఎంఎస్ స్వామినాథన్ .. సేవలకు ఎన్నో అవార్డులు

ఎంఎస్ స్వామినాథన్ ..   సేవలకు ఎన్నో అవార్డులు

 

  • హరిత విప్లవ పితామహుడు .. ఎంఎస్ స్వామినాథన్  కన్నుమూత 
  • వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస
  • వ్యవసాయరంగ అభివృద్ధికి విశేష కృషి 
  • రాష్ట్రపతి, ప్రధాని, ప్రముఖుల సంతాపం

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ (98) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో గురువారం ఉదయం 11.15 గంటలకు చెన్నైలోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధి, అధిక దిగుబడిని ఇచ్చే వరి, గోధుమ విత్తనాల రూపకల్పనలో  స్వామినాథన్ కీలక పాత్ర పోషించారు. బెంగాల్​ కరువును చూసి చలించిన ఆయన తన పరిశోధనలతో దేశం ఆకలి తీర్చారు. విత్తనాల అభివృద్ధితో దిగుబడులు పెరిగి దేశంలో ఆకలి చావులు భారీగా తగ్గిపోయాయి. వ్యవసాయ రంగంలో ఆయన కృషికి రామన్ మెగసెసె అవార్డు, వరల్డ్ ఫుడ్ ప్రైజ్​, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ తదితర ఎన్నో అవార్డులు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. ప్రెసిడెంట్​ ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్​ తదితరులు ఆయనకు నివాళులర్పించారు.

చెన్నై:  ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు మన్కోంబు సాంబశివన్ స్వామినాథన్ (98) కన్నుమూశారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా గురువారం ఉదయం 11:15 గంటలకు చెన్నైలోని తన ఇంట్లో ఆయన తుదిశ్వాస విడిచారు. మన దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు స్వామినాథన్ విశేష కృషి చేశారు. అధిక దిగుబడిని ఇచ్చే వరి, గోధుమ వంటి విత్తనాల రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. స్వామినాథన్ మృతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘స్వామినాథన్ గొప్ప వారసత్వాన్ని అందించి వెళ్లారు. ఇది ఆకలి కేకలు లేని భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించేందుకు కాంతిరేఖగా మార్గదర్శనం చేస్తుంది” అని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ‘‘స్వామినాథన్ గొప్ప సేవలు అందించారు. దేశంలో ఆహార భద్రతకు భరోసా ఇచ్చారు. ఆయన ఎప్పుడూ దేశం అభివృద్ధి చెందాలని తపించేవారు. ఆయన జీవితం తరతరాలకు స్ఫూర్తినిస్తుంది” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐఏఆర్ఐ) డైరెక్టర్ ఏకే సింగ్, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల గవర్నర్లు, సీఎంలు స్వామినాథన్ మృతికి సంతాపం తెలిపారు.

మెడికల్ నుంచి అగ్రికల్చర్ కు..  

స్వామినాథన్ 1925 ఆగస్టు 7న అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ (తమిళనాడు)లోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తండ్రి ఎంకే సాంబశివన్ (సర్జన్), తల్లి పార్వతి తంగమ్మాళ్. స్వామినాథన్ భార్య మీనా 2022లో మరణించారు. ఆయనకు ముగ్గురు బిడ్డలు సౌమ్య, మధుర, నిత్యారావ్ ఉన్నారు. సౌమ్య వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో చీఫ్ సైంటిస్ట్ గా పని చేశారు. మెట్రిక్యులేషన్ పూర్తయ్యాక స్వామినాథన్ తో మెడిసిన్ చేయించాలని అతని తల్లిదండ్రులు జువాలజీలో జాయిన్ చేయించారు. అయితే 1943లో బెంగాల్ లో వచ్చిన కరువును చూసి స్వామినాథన్ తన మనసు మార్చుకున్నారు. వ్యవసాయ పరిశోధనల వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నారు. తిరువనంతపురంలోని మహారాజా కాలేజీలో జువాలజీ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మద్రాస్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ సైన్స్ డిగ్రీ చేశారు. 1947లో ఢిల్లీకి వెళ్లి ఐఏఆర్ఐలో పీజీ చదివారు. సివిల్స్ కు ప్రిపేర్ అయి ఐపీఎస్ కు సెలెక్ట్ అయినప్పటికీ, జెనెటిక్స్ (జన్యుశాస్త్రం)లో యునెస్కో ఫెలోషిప్ రావడంతో రీసెర్చ్ కోసం నెదర్లాండ్స్ వెళ్లారు. అనంతరం 1950లో బ్రిటన్ కు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కేమ్ బ్రిడ్జిలో పీహెచ్ డీ పూర్తి చేశారు. తర్వాత అమెరికాలో పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ చేశారు. 

84 గౌరవ డాక్టరేట్లు..  

స్వామినాథన్ వ్యవసాయ రంగంలో ఎన్నో పరిశోధనలు చేశారు. ఆయన చేసిన సేవలకు ఎన్నో అవార్డులు వచ్చాయి. రామన్ మెగసెసె అవార్డు (1971), వరల్డ్ ఫుడ్ ప్రైజ్ (1987), శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (1961), పద్మశ్రీ (1967), పద్మభూషణ్ (1972), పద్మవిభూషణ్ (1989) తదితర అవార్డులు దక్కాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి ఆయన 84 గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. 

ఎన్నో కీలక బాధ్యతలు.. 

స్వామినాథన్ తన కెరీర్ లో ఎన్నో బాధ్యతలు నిర్వర్తించారు. 1961 నుంచి 1972 వరకు ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ గా పని చేశారు. 1972 నుంచి 79 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ గా, కేంద్ర ప్రభుత్వ సెక్రటరీగా సేవలందించారు. 1979–80 మధ్య ప్రిన్సిపల్ సెక్రటరీగా, 1980–82 వరకు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ గా, 1982–88 వరకు ఫిలిప్పీన్స్ లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ గా పని చేశారు. 2007 నుంచి 2013 వరకు రాజ్యసభ ఎంపీగా సేవలందించారు. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సమస్యల పరిష్కారానికి 2004లో ఏర్పాటైన ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’కు స్వామినాథన్ నేతృత్వం వహించారు. ఈ కమిషన్ చేసిన కీలక సిఫారసులను అమలు చేయాలని దేశంలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. 

రేపు అంత్యక్రియలు

ఎంఎస్ స్వామినాథన్ అంత్యక్రియలను ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. దేశంలో ఆకలి నిర్మూలన, ఆహార భద్రత కోసం ఆయన 75 ఏండ్ల పాటు అవిశ్రాంత కృషి చేశారని కొనియాడారు. కాగా, స్వామినాథన్ అంత్యక్రియలను శనివారం నిర్వహించనున్నట్టు ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ వెల్లడించింది.