- మెడికవర్ డాక్టర్ల అరుదైన ఆపరేషన్ సక్సెస్
హైదరాబాద్, వెలుగు: ఓ వ్యక్తిని 25 ఏండ్లుగా వేధిస్తున్న 'రైట్ నెక్ లింఫాంగియోమా(మెడపై గడ్డ)' సమస్యను మెడికవర్ హాస్పిటల్స్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్‌తో పరిష్కరించారు. కీలక నరాలు, శ్వాసనాళం, రక్తనాళాల మధ్యలో ఉన్న 5 కిలోల గడ్డను 5 గంటల పాటు శ్రమించి విజయవంతంగా తొలగించారు. రోగికి కొత్త జీవితాన్ని అందించారు. ఆపరేషన్ అయిన మూడు రోజుల్లోనే రోగి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. లింఫ్, రక్తనాళాలు అసాధారణంగా పెరిగి ఏర్పడే 'లింఫాంగియోమా' అనేది అత్యంత అరుదైన "మాల్ఫార్మేషన్ (అభివృద్ధిలో లోపం)". ఈ సమస్యతో బాధపడుతున్న పేషెంట్ 2010, 2015, 2025లో మూడు సార్లు ఆపరేషన్లు చేయించుకున్నాడు.
కానీ, గడ్డ మళ్లీ పెరిగి మెడను పూర్తిగా కప్పేసింది. ఫలితంగా అతని మెడ కదలికలు ఆగిపోవడంతోపాటు శ్వాస తీసుకోవడం కష్టమైంది. రోజువారీ జీవితం ఇబ్బందికరంగా మారింది. అయితే, తాజాగా మెడికవర్హాస్పిటల్స్ డాక్టర్లు ఆ వ్యక్తికి సక్సెస్‌ఫుల్‌గా ఆపరేషన్ చేశారు. మెడలోని కీలక నరాలు, అన్ననాళం, శ్వాసనాళం, రక్తనాళాలకు దగ్గరగా గడ్డ పెరగడంతో ఆపరేషన్ అత్యంత రిస్కీగా మారింది. మునుపటి ఆపరేషన్ల వల్ల ఏర్పడిన మచ్చల కణజాలం (స్కార్ టిష్యూ) మరింత క్లిష్టమైంది. అంతటి క్లిష్టమైన ఆపరేషన్‌ను సీనియర్ వాస్క్యులర్ సర్జన్ డా. రాహుల్ లక్ష్మీనారాయణ, కన్సల్టెంట్ జనరల్ సర్జన్ డా. వెంకట్ పవన్, అనస్థీషియా స్పెషలిస్ట్ డా. వేణుగోపాల్ నేతృత్వంలోని టీమ్ విజయవంతంగా పూర్తిచేశారు. ఐదు గంటల పాటు శ్రమించి ఐదు కిలోల గడ్డను తొలగించి రోగికి కొత్త జీవితాన్ని అందించారు.
