కూతురు ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవు అమ్మిన తండ్రి

కూతురు ఆన్ లైన్ క్లాసుల కోసం ఆవు అమ్మిన తండ్రి

కూతురు ఆన్ లైన్ చదువు కోసం ఓ తండ్రి ఆవును అమ్మిన ఘటన హిమాచల్ ప్రదేశ్ లో జరిగింది. కాంగ్రా జిల్లాకు చెందిన కుల్దీప్ కుమార్ వ్యవసాయం చేసుకుంటూ తన పిల్లలను చదివిస్తున్నాడు. అయితే కరోనా వైరస్ దెబ్బకు స్కూళ్లన్నీ మూతపడ్డాయి. దాంతో విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకూడదని దేశంలోని చాలా పాఠశాలలు ఆన్ లైన్ విద్యను బోధిస్తున్నాయి. అయితే వ్యవసాయం చేసుకునే కుల్దీప్ కుమార్ కు స్మార్ట్ ఫోన్ లేదు. దాంతో కూతరు చదువుకోవడం ఇబ్బందిగా మారింది. అందుకోసం ఎలాగైనా స్మార్ట్ ఫోన్ కొనాలని అనుకున్నాడు. తన దగ్గర అంత డబ్బు లేకపోవడంతో కుల్దీప్ కుమార్ ఫోన్ కొనడానికి కావలసిన డబ్బును దాదాపు మూడు నెలల క్రితం ఒక వ్యక్తి దగ్గర అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బుతో కూతరుకి ఫోన్ కొనిచ్చాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఆన్ లైన్ తరగతులకు హాజరవుతుంది. అయితే అప్పిచ్చిన వ్యక్తి ఇప్పడు ఆ డబ్బు కట్టాలని ఒత్తిడి తెచ్చాడు. దాంతో ఏం చేయాలో తెలియని కుల్దీప్ కుమార్ తనకున్న రెండు ఆవులలో ఒక ఆవును విక్రయించి డబ్బు చెల్లించాడు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పాకి సోషల్ మీడియాలో వైరల్ గా మారి.. జిల్లా యంత్రాంగం వరకు చేరుకుంది. వెంటనే స్పందించిన అధికారులు.. కుల్దీప్ కుమార్ దగ్గరకు వెళ్లి అతని ఆవును అతనికి ఇప్పించారు. కానీ, కల్దీప్ మాత్రం ఆవును కట్టేయడానికి తన ఇంట్లో స్థలం లేదని చెప్పి ఆవును వద్దని నిరాకరించాడు. దాని బదులు శిథిలమైన తన తన ఇంటిని బాగుచేసుకోవడానికి సాయం చేయాలని కోరాడు. దాంతో అధికారులు బీపీఎల్ కేటగిరి కింద ఇంటి పునర్నిర్మాణానికి సాయం చేస్తామని సీనియర్ రెవెన్యూ అధికారి జగదీష్ శర్మ హామీ ఇచ్చారు.

ఇదే విషయంపై కుల్దీప్ కుమార్ మాట్లాడుతూ.. ‘నా కూతురు చదువు కోసం ఆవును అమ్మాను. జిల్లా అధికారులు నా వద్దకు వచ్చి ఆవును ఇప్పిస్తామన్నారు. కానీ, నాకు ఆవు బదులు నా ఇంటిని బాగుచేసుకోవడానికి సాయం చేయాలని కోరాను. దానికి వారు ఒప్పుకున్నారు. స్కూళ్లు మూతపడటంతో.. నా కూతురు చదువుకు దూరం కాకూడదని ఇలా చేశాను’ అని అన్నాడు.

పంజాబ్ లో ఆన్‌లైన్ క్లాసుల కోసం తన తండ్రి స్మార్ట్ ఫోన్ కొనలేదని గత నెలలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఇలా చాలామంది విద్యార్థులు ఆన్ లైన్ క్లాసుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికస్థోమత లేకపోవడంతో వారిని ఇబ్బంది పెట్టలేక విద్యార్థలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆన్ లైన్ క్లాసుల విషయంలో తగు నిర్ణయం తీసుకుంటే మంచిదని తల్లిదండ్రులు వాపోతున్నారు.

For More News..

దేశంలో నిన్న ఒక్కరోజే 49,310 కేసులు నమోదు

కేటీఆర్ కు మెగాస్టార్ బర్త్ డే విషెస్

పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ ద్వారా 5 నిమిషాల్లో లోన్!

గ్రీన్ కార్డ్ కోసం ఓ వ్యక్తి 195 ఏండ్ల వెయిటింగ్ లిస్ట్!