వుహాన్ ల్యాబ్ గుట్టు.. ఫౌచీ దాచిండా? 

వుహాన్ ల్యాబ్ గుట్టు.. ఫౌచీ దాచిండా? 

3 వేల పేజీల ఈమెయిల్స్ లో ఆసక్తికర విషయాలు
వాషింగ్టన్/న్యూఢిల్లీ: ‘కరోనా వైరస్ చైనాలోనే పుట్టింది.. వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయింది’.. అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల ఆరోపణలివి. కాదని మొండిగా వాదిస్తోంది చైనా. తమకు సంబంధమే లేదని చెబుతోంది. ఈ గొడవ ఇప్పటిది కాదు.. ఏడాది కిందట కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచే ఉంది. ఇప్పుడు అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ ఈ మెయిల్స్ లీక్ కావడంతో.. గొడవ మళ్లీ మొదటికి వచ్చింది. వుహాన్ ల్యాబోరేటరీ నుంచే కరోనా వైరస్ లీక్ అయిండొచ్చనే థియరీని ఫౌచీ, ఆయన తోటి ఉద్యోగులు మొదట్లోనే నోటీస్ చేసినట్లు ఈమెయిల్స్ ద్వారా వెల్లడైంది. కానీ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయ్యేందుకు అవకాశమే లేదని గతంలో ఫౌచీ చెప్పారు. తర్వాత మాత్రం మాట మార్చారు. వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయ్యేందుకు అవకాశం ఉందని, వుహాన్ ల్యాబ్​లో అనారోగ్యానికి గురైన ముగ్గురి మెడికల్ రికార్డులు ఇవ్వాలని చైనాను కోరారు. గతేడాది జనవరి నుంచి జూన్ దాకా ఫౌచీ పంపిన, రిసీవ్ చేసుకున్న 3 వేల పేజీల ఈమెయిల్స్ ను ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాషింగ్టన్ పోస్టు తదితర మీడియా సంస్థలు సంపాదించాయి. అవి ఇప్పుడు వివాదానికి కేంద్రబిందువయ్యాయి.
ఫౌచీ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
ఈమెయిల్స్ బయటికి రావడంతో ఫౌచీ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. మాస్కులు పెట్టుకోవాల్సిన అవసరం లేదని గతేడాది ఏప్రిల్ లో ఆయన చెప్పడం, కరోనా వైరస్ వుహాన్‌ ల్యాబ్‌ నుంచే లీక్‌ అయిందన్న థియరీని కొట్టిపారేయడంపై విమర్శలు వస్తున్నాయి. ట్విట్టర్ లో అయితే ఏకిపారేస్తున్నారు. ఫౌచీపై విచారణ జరపాల్సిందేనని డిమాండ్లు చేస్తున్నారు. వుహాన్ ల్యాబ్ తో సంబంధం ఉన్న ఎకో హెల్త్ అలయన్స్ సంస్థ ఎగ్జిక్యూటివ్.. థ్యాంక్స్ చెబుతూ ఫౌచీకి పంపిన ఈ మెయిల్ కూడా వివాదాస్పదమైంది.
వుహాన్ మెడికల్ రికార్డులు చూపండి: ఫౌచీ
‘‘2019లో వుహాన్ ల్యాబ్ లో అనారోగ్యానికి గురైన ముగ్గురు వ్యక్తుల మెడికల్ రికార్డులు చూపండి. వారు నిజంగా అనారోగ్యానికి గురయ్యారా? అయితే.. అనారోగ్యానికి కారణమేంటి?’’ అని చైనాను ఫౌచీ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ ల్యాబ్ నుంచి లీక్ అయిందా లేదా అనే దానిపై కీలకమైన ఆధారాలు అందించే తొమ్మిది మంది మెడికల్ రికార్డులను రిలీజ్ చేయాలని కోరారు.
డబ్ల్యూహెచ్ వోను ఆహ్వానించండి: చైనా కౌంటర్
కరోనా వైరస్ పుట్టుకపై స్టడీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)ను ఆహ్వానించాలని అమెరికాకు చైనా హితవు పలికింది. ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న 200కు పైగా బయో ల్యాబ్‌ల గురించి వివరించాలని చైనా ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ వాంగ్ వెన్ బిన్ డిమాండ్ చేశారు. తొమ్మిది మంది మెడికల్ రికార్డులు రిలీజ్ చేయాలంటూ ఫౌచీ కోరడంపై స్పందిస్తూ ఈ కామెంట్స్ చేశారు.