
జపనీస్ ఆర్టిస్ట్ మసటక శిశిదొ, ఇతను డీజే కూడా. ఇతడ్ని డీజే డో అని కూడా పిలుస్తారు. మొదటిసారి తన డెబ్యూ ఆల్బమ్ చేశాడు. ఆ టైంలో తను ఒక సిలికాన్ ఫ్లెష్ కోటింగ్ వేసిన మ్యూజిక్ ప్యాడ్‌ని వాడాడు. ఆ తర్వాత అచ్చం మనిషి చర్మంలా అనిపించే, హైపర్ రియలిస్టిక్ ఫ్లెష్తో కొన్ని ఆకారాలు తయారుచేశాడు. వాటిలో మనిషి ముఖం, పెదాలు, కళ్లు వంటి భాగాలు వేటికవే వేరువేరుగా ఉంటాయి. నిజానికి మొదటిసారి వాటిని చూస్తే ఆశ్చర్యంతోపాటు, కొంచెం భయం కూడా వేస్తుంది.
తను తయారుచేసిన వాటిని చూసి ప్రజలు ఇంకా బాగా చేయమని ఎంకరేజ్ చేసేవాళ్లు. దాంతో ఆ జర్నీని కంటిన్యూ చేశాడు శిశిదొ. అసలు ఇలాంటివి తయారుచేయాలనే ఆలోచన ఎలా వచ్చిందని అడిగితే.. ‘హారర్ సినిమా ‘ది ఫ్లై’ చూసి ఇన్స్పైర్ అయ్యా. సైన్స్ ఫిక్షన్ సినిమాలు బాగా చూస్తా. ఆ సినిమాలు చూడడం వల్లే ఇలాంటి ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి డైలీ వాడే కొన్ని వస్తువుల్ని ఉపయోగించి, ‘మనిషి చర్మం(హ్యూమన్ ఫ్లెష్)’ తయారుచేశా. అప్పటి నుంచి ఫాక్స్ ఫ్లెష్ యాక్సెసరీలు తయారుచేయడం కంటిన్యూ చేశా.
నేను ఇప్పటి వరకు తయారుచేసిన వాటిలో మనిషి నోటి ఆకారంలో ఉండే నాణేలు వేసుకునే చిన్న పర్స్, చేతి వేలి ఆకారంలో ఉన్న స్టాంప్ హోల్డర్, ఐ ఫోన్ కేస్ వంటివి నాకు చాలా నచ్చాయి. చాలామంది నుంచి అలాంటివి తయారుచేసివ్వమని ఆర్డర్లు వచ్చాయి. వీటి ధర వెయ్యి నుంచి నాలుగు వేల డాలర్లు ఉంటుంది. అయినా, వీటిని కొనేందుకు ప్రజలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు హ్యాపీగా ఉంది. త్వరలోనే సొంత ఎగ్జిబిషన్ పెట్టాలనుకుంటున్నా’ అంటున్నాడు శిశిదొ.