
- ‘విరాట పర్వం’ హీరోయిన్ సాయి పల్లవి కామెంట్
‘విరాట పర్వం’ సినిమాపై బిగ్ హిట్ టాక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ వేణు ఉడుగల తెలిపారు. అన్ని చోట్ల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. శనివారం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన ‘విరాట పర్వం’ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. తమ బ్యానర్ లో తొలిసారి ఒక అమ్మాయి నిజ జీవితంలో జరిగిన ఘటనలను సినిమాగా తీశామని నిర్మాత డి.సురేష్ బాబు చెప్పారు. ఈ బయోపిక్ ను తమ మూవీ బుక్ లో గర్వంగా రాసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘‘ప్రతి ఇంట్లో ప్రేమ కథలుంటాయి. కొన్ని సరైనవి ఉంటాయి. కొన్ని తప్పుగా ఉంటాయి. ఇది నక్సల్ సినిమా కాదు. పూర్తి స్వచ్ఛమైన ప్రేమకథ. రెగ్యులర్ సినిమా రోజుల్లో వచ్చిన.. ఒక మంచి సినిమా ఇది’’ అని ఆయన కామెంట్ చేశారు. హీరోయిన్ సాయిపల్లవి అంగీకరించకపోతే ఈ సినిమానే లేదన్నారు. ‘‘సినిమా వ్యాపారంలో ఒక కళ ఉంది. అది ఏ స్థాయిలో ఉండాలో ప్రజలు నిర్ణయిస్తారు. కొన్ని కళాత్మక సినిమాలు తీయాల్సిన బాధ్యత మా పై ఉంది’’ అని సురేష్ బాబు పేర్కొన్నారు. సక్సెస్ ఫుల్ సినిమాలన్నీ బ్యాడ్ అని చెప్పనన్నారు.
కథపై నాలుగేళ్లు వర్క్..
డైరెక్టర్ వేణు ఉడుగల ఈ కథపై దాదాపు నాలుగేళ్లు వర్క్ చేశారని కామ్రేడ్ సరళ సోదరుడు మోహన్ రావు తెలిపారు. సినిమాను చాలా బాగా తెరకెక్కించారని, సరళ విప్లవం కోసం బతికింది.. విప్లవం కోసమే పనిచేసిందన్నారు. ఈసందర్భంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘‘నేను మోహన్ రావు గారి ఇంటికి వెళ్లినప్పుడు.. ఆ ఫ్యామిలీని చూసి గుండె బరువెక్కింది. వేణు గారు సరళ కథను ప్రజల వద్దకు చేర్చాలని ఎంతో హార్డ్ వర్క్ చేశారు. సురేష్ బాబు గారు సినిమాకు సంబంధించిన అన్ని విషయాలలో ఎంతో కేర్ తీసుకున్నారు. నేను సరళ పాత్ర చేసినందుకు గర్వంగా ఉంది. ఈరోజు వస్తున్న హిట్ టాక్ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’’ అని ఆమె చెప్పారు. కార్యక్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.