నిరుపయోగంగా మారుతున్న గాంధీ ఆస్పత్రిలోని ఫర్టిలిటీ సెంటర్

నిరుపయోగంగా మారుతున్న గాంధీ ఆస్పత్రిలోని ఫర్టిలిటీ సెంటర్

మెడిసిన్, ఇంజక్షన్లు, కెమికల్స్‌‌ సప్లై బంద్‌‌

హైదరాబాద్, వెలుగు: గాంధీ ఆస్పత్రిలో ఫర్టిలిటీ సెంటర్ నిరుపయోగంగా మారుతోంది. ఐవీఎఫ్ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకొస్తామన్న మంత్రి హామీ అమలుకు నోచుకోకపోగా, ఐయూఐ ప్రొసీజర్లు కూడా ఆగిపోయాయి. ఐయూఐ చేయడానికి అవసరమైన ఇంజక్షన్లు, కెమికల్స్‌‌ను టీఎస్‌‌ఎంఎస్‌‌ఐడీసీ సప్లై చేయడం లేదు. గాంధీ హాస్పిటల్ వద్ద ఉన్న డబ్బులతో వీటిని కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ఆ పని కూడా చేయడం లేదు. దీంతో నిత్యం పదుల సంఖ్యలో పేషెంట్లు వస్తున్నా, డాక్టర్లు ఏమీ చేయలేకపోతున్నారు. సొంతగా డబ్బులు పెట్టి బయట మెడికల్ షాపుల్లో ఇంజక్షన్లు, కెమికల్స్‌‌ కొని తెచ్చుకున్న వారికి మాత్రమే ఐయూఐ చేయగలం అని చెబుతున్నారు. ఈ ఇంజక్షన్లు, కెమికల్స్‌‌కు కలిపి రూ.10  వేల నుంచి 12 వేల వరకు అవుతాయి. ఇవి ఒకసారి ఐయూఐ చేయడానికి మాత్రమే పనికొస్తాయి. ఒకవేళ మొదటిసారి సక్సెస్ అవకపోతే, మరోసారి ఐయూఐ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కూడా పేషెంట్ సొంతగా రూ.12 వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇదంతా ముందే పేషెంట్లకు వివరిస్తున్నామని, ఇక్కడికి వచ్చే పేషెంట్లు పేదవారు కావడంతో డబ్బులు ఖర్చు చేసే  స్థోమత లేక  వెనక్కి వెళ్లిపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఔట్ పేషెంట్, టీవీఎస్‌‌ స్కానింగ్‌‌, ల్యాప్రోస్కోపి, డయాగ్నస్టిక్ హిస్టిరోల్యాప్రోస్కోపి వంటి స్కాన్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల మెడిసిన్ అందుబాటులో ఉండగా, ఇంకొన్ని రకాల మెడిసిన్ బయట కొనుక్కోవాలని చెప్పి పంపుతున్నారు.

ఐవీఎఫ్‌‌ ఎప్పుడు?

గాంధీ ఫర్టిలిటీ సెంటర్‌‌‌‌లో ఐవీఎఫ్ ఫెసిలిటీని కూడా అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆర్నెల్ల కిందటే మంత్రి హరీశ్‌‌రావు ప్రకటించారు. ఐవీఎఫ్ చేయడానికి ఏమేం అవసరమోప్రపోజల్స్‌‌ రెండీ చేసి గాంధీ డాక్టర్లు ప్రభుత్వానికి పంపించారు. కానీ, ఇప్పటివరకు ఐవీఎఫ్‌‌ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్న జంటలకు చికిత్స అందించేందుకు 2018లో ఇక్కడ ఫర్టిలిటీ సెంటర్ పెట్టాలని నిర్ణయించారు. తొలుత ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఓపీ సేవలతోనే ఈ సెంటర్ ప్రారంభమైంది. వందల మంది ఇక్కడికి వస్తుండడంతో కొన్ని రకాల స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఐయూఐ సేవలను కూడా ప్రారంభించారు. దీంతో గాంధీ ఫర్టిలిటీ సెంటర్‌‌‌‌కు ఆదరణ పెరిగింది. ప్రైవేటు హాస్పిటళ్లలో ఐయూఐ, ఐవీఎఫ్ వంటి ప్రొసీజర్లకు లక్షల్లో చార్జ్‌‌ చేస్తున్నారు. ఈ చార్జీలను భరించలేని పేద దంపతులు గాంధీకి రావడం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని హాస్పిటళ్లలో ఫర్టిలిటీ సెంటర్లు పెట్టాల్సిన అవసరం ఉందని డాక్టర్లు ప్రభుత్వానికి సూచించారు. ఈ ప్రతిపాదనను కూడా అమల్లోకి తీసుకొస్తామని మంత్రి హరీశ్‌‌రావు గతంలో ప్రకటించారు. కానీ, ఇప్పుడు మెడిసిన్, కెమికల్స్‌‌ సప్లై బందు పెట్టి ఒక్కగానొక్క గవర్నమెంట్‌‌ ఫర్టిలిటీ సెంటర్‌‌‌‌ను కూడా పేషెంట్లకు ఉపయోగపడకుండా చేస్తుండడం గమనార్హం.