బీఆర్ఎస్‌‌లో టికెట్ల బుగులు

బీఆర్ఎస్‌‌లో టికెట్ల బుగులు

సగం మందికిపైగా ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం
కేసీఆర్‌‌‌‌కు సర్వే సంస్థలు, ఇంటెలిజెన్స్‌‌ నివేదికలు
వారిని మళ్లీ పోటీకి దించితే నష్టం తప్పదని హెచ్చరికలు
‘సిట్టింగులకు సీటు’పై సీఎం పునరాలోచన
వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ఇతర లీడర్లపై ఫోకస్
ఆందోళనలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. సొంతంగా సర్వేలు
నియోజకవర్గాల్లో గ్రాఫ్ పెంచుకునేందుకు తంటాలు

హైదరాబాద్‌‌, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల టికెట్ల ఫీవర్ అధికార పార్టీని కుదిపేస్తున్నది. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత జాతీయ రాజకీయాలపై కేసీఆర్ ఫోకస్​పెట్టిన టైమ్‌‌లో.. సొంత రాష్ట్రంలో ఏమవుతున్నదనే  కలవరపాటు పార్టీలో వణుకు పుట్టిస్తున్నది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్నట్లుగా పార్టీ అధినేత కొద్ది రోజులుగా చేస్తున్న హడావుడి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆగమాగం చేస్తున్నది. సిట్టింగులందరికీ మళ్లీ టికెట్లు ఇస్తామని నెల కిందట కేసీఆర్ ప్రకటించారు. కానీ వీరిలో సగం మంది గెలిచే పరిస్థితి లేదని, మితిమీరిన ప్రజా వ్యతిరేకత ఉందనే రిపోర్టులపై పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ డిస్కస్ చేసినట్లు తెలిసింది. ఆ విషయాలు బయటికి తెలియటంతో ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. తమకు టికెట్​దక్కుతుందో లేదోననే ఆందోళనతో నియోజకవర్గాల్లో ఉరుకులు పరుగులు పెడుతున్నారు. 

గత ఎన్నికల్లో కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు.. ఇతర పార్టీల నుంచి గెలిచి చేరిన వారితో గులాబీ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య 104కి చేరింది. వీరికి టికెట్లు ఇస్తే గెలిచే పరిస్థితి ఉందా? లేదా? అని కేసీఆర్ ప్రతినెలా వివిధ సర్వే ఏజెన్సీలు, ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. వీరిలో సగం మందికిపైగా ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే సమాచారం అందటంతో పార్టీ పెద్దలు అప్రమత్తమయ్యారు.

కొందరు ఎమ్మెల్యేల సొంత సర్వేలు

టికెట్​ వస్తదో రాదో అని భయపడి కొందరు ఎమ్మెల్యేలు సొంతంగా సర్వే సంస్థలను నియమించుకుంటున్నారు. నియోజకవర్గంలో తమ గ్రాఫ్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గాల్లో తమ పనితీరు ఎలా ఉంది? సొంత పార్టీలో టికెట్‌‌‌‌ ఆశిస్తున్న వాళ్లు, గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్లపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది? అనే వివరాలు సేకరిస్తున్నారు. సర్వేల్లో వ్యతిరేకత ఎదురవుతున్న ఎమ్మెల్యేలు.. పరిస్థితిని మార్చుకోవడంపై దృష్టి పెట్టారు. ఏదో ఒక యాక్టివిటీతో నిత్యం ప్రజల మధ్యే ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు వరుస ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వివిధ పనుల మంజూరు చేయిస్తామంటూ హామీలతో నియోజకవర్గంలోనే పర్యటిస్తున్నారు. అధినేత మెప్పు పొందేందుకు.. ఇటీవల కొందరు మునుగోడులో తమకు అప్పగించిన గ్రామాల్లో పోటీపడి ఖర్చు చేశారు.

రియల్‌‌‌‌ దందాలు, సెటిల్‌‌‌‌మెంట్లు

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌గా మారిన టీఆర్ఎస్‌‌‌‌కు అసెంబ్లీలో 104 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎంఐఎం పార్టీకి ఏడుగురు, కాంగ్రెస్‌‌‌‌కు ఐదుగురు, బీజేపీకి ముగ్గురు సభ్యులు ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో 60 మందికి పైగా రెండు నుంచి నాలుగు సార్లు గెలిచారు. నాలుగు కన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్లు 16 మంది ఉన్నారు. 2018లోనే మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు 28 మంది ఉన్నారు. రెండు, అంతకన్నా ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో సగం మంది, మొదటిసారి ఎమ్మెల్యేలైన వారిలో సగానికన్నా ఎక్కువ మంది ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు రియల్‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌ దందాలు, సెటిల్‌‌‌‌మెంట్లు, ఇసుక మాఫియాలో కూరుకుపోయారు. వాళ్లపైనే ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత ఉన్నట్టుగా గుర్తించారు. వాళ్లకు మళ్లీ టికెట్లు ఇస్తే నష్టం తప్పదనే అంచనాకు పార్టీ పెద్దలు వచ్చారు. సర్వే ఏజెన్సీలు ముందే హెచ్చరించినా జీహెచ్‌‌‌‌ఎంసీలో ఎక్కువ మంది సిట్టింగ్‌‌‌‌ కార్పొరేటర్లనే బరిలోకి దించడంతో పార్టీకి పెద్ద దెబ్బ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అలాగే మొండిగా టికెట్లు ఇస్తే ఇతర పార్టీలకు చాన్స్‌‌‌‌ ఇచ్చినట్టు అవుతుందని బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతున్నది. అందుకే వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేలను వచ్చే అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పించాలనే ఆలోచనలో గులాబీ బాస్‌‌‌‌ ఉన్నట్టు తెలుస్తున్నది. ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని పోటీకి దించితే గెలుపు చాన్స్​లున్నాయనే దానిపై దృష్టి పెట్టారు. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో ఉన్న ఇతర నేతల పనితీరు, వాళ్ల గురించి ప్రజలు ఏమనుకుంటున్నారనే వివరాలు సేకరించే పని లో పడ్డారు. వేరోళ్లను పోటీకి దించితే ఎలా ఉంటుంద ని సీఎం ఆలోచన చేస్తున్నట్లు వస్తున్న సమాచారం ఎమ్మెల్యేలందరినీ కలవరపెడుతున్నది.

నియోజకవర్గాల్లో విభేదాలు

అసెంబ్లీ ఎప్పుడైనా రద్దు కావొచ్చని ప్రగతి భవన్‌‌ వర్గాలు లీకులిస్తున్నాయి. మరోవైపు కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌‌తో కలిసి పనిచేస్తామని కేసీఆర్‌‌ ఇటీవల ప్రకటించారు. కర్నాటక, ఇతర రాష్ట్రాల్లో రైతు సమావేశాల పేరుతో కేసీఆర్‌‌ తిరుగుతూ ఉంటే ఇక్కడ ప్రత్యర్థి పార్టీలు బలం పెంచుకునేందుకు చాన్స్​ ఇచ్చినట్టు అవుతుందని ఎమ్మెల్యేలు హైరానా పడుతున్నారు. పార్టీలో గ్రూపులు, కుమ్ములాటలు వచ్చే ఎన్నికల్లో ముంచేసే అవకాశముందని టెన్షన్‌‌ పడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో టికెట్‌‌ రాని నేతలకు ఎమ్మెల్సీ లేదా ఇతర పదవులు ఇస్తామని కేసీఆర్‌‌ హామీ ఇచ్చారు. ఇలాంటి వాళ్లు సుమారు 50 మంది వరకు ఉంటారు. వారెవరితోనూ సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలకు పొసగడం లేదు. ఇది కూడా పార్టీకి చేటు చేస్తుందని కేసీఆర్​ అంచనా వేస్తున్నారు. ఈక్రమంలోనే ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉన్న ఎమ్మెల్యేల టికెట్లకు కత్తెర వేయాలని నిర్ణయించినట్టు ప్రచారం జరుగుతున్నది.

గ్రాఫ్ ఎట్లున్నది.. జనం ఏమనుకుంటున్నరు

వరుసగా రెండు సార్లు అధికారంలో ఉండటం, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోవటంతో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందని, మునుగోడు బై ఎలక్షన్​లో గట్టి పోటీ ఇచ్చిన తీరే అందుకు ఉదాహరణని బీఆర్​ఎస్​ లీడర్లు కూడా అంగీకరిస్తున్నారు. ఈ టైమ్‌‌లో సిట్టింగ్‌‌లపై  ప్రజల్లో వ్యతిరేకత పార్టీ ముఖ్యులను కలవరపాటుకు గురిచేస్తున్నది. దీంతో ఎమ్మెల్యేల పనితీరు, వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశాలపై సీఎం కేసీఆర్‌‌, మంత్రి కేటీఆర్ కూడా ఆరా తీస్తున్నారు. ఆరు నెలల కిందట పీకే టీమ్ ఇచ్చిన రిపోర్టు పరిశీలించడంతోపాటు.. కొత్తగా రెండు ఏజెన్సీలతో సర్వేలు చేయిస్తున్నారు. సిట్టింగ్‌‌లపై ఉన్న వ్యతిరేకతను అధిగమించేందుకు ఏం చేద్దామనే కోణంలోనూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఈ వరుస పరిణామాలన్నీ ఎమ్మెల్యేలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత ఉన్న జాబితాలో తాముంటే టికెట్​కట్ అవుతుందని కొందరు ఎమ్మెల్యేలు భయపడుతున్నారు.