ఈసారి ఆర్థిక వృద్ధి 7.5-8 శాతం..2024-25లో 8 శాతం ఉండొచ్చు : ఫిక్కీ ప్రెసిడెంట్‌

ఈసారి ఆర్థిక వృద్ధి 7.5-8 శాతం..2024-25లో 8 శాతం ఉండొచ్చు : ఫిక్కీ ప్రెసిడెంట్‌
  • –పెట్టుబడులు పెరుగుతున్నాయ్​
  • ప్రకటించిన ఫిక్కీ ప్రెసిడెంట్‌

న్యూఢిల్లీ :  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి 7.5 నుంచి 8 శాతం వరకు ఉంటుందని, 2024-–-25లో ఇది ఎనిమిది శాతంగా ఉంటుందని పరిశ్రమ అంచనా వేస్తోంది.  బలమైన వృద్ధి ఊపందుకోవడం, సానుకూల సెంటిమెంట్లు,  పెరుగుతున్న ప్రైవేట్ పెట్టుబడులతో జీడీపీ దూసుకెళ్తుందని ఫెడరేషన్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)కి కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు అనీశ్​ షా సోమవారం తెలిపారు.   అయితే, భారతదేశ వృద్ధి అవకాశాలపై భౌగోళిక రాజకీయ ఒత్తిళ్లు ప్రభావం చూపుతాయని ఆయన అన్నారు. "మనం ఇప్పటివరకు 7.8 శాతం, 7.6 శాతం వరకు జీడీపీ పెరగడాన్ని చూశాం. ఇదే పోకడ ఇక నుంచి కూడా ఉండొచ్చు.  చాలా కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అందుకే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.5 శాతం నుంచి 8 శాతం వరకు కొనసాగుతుందని భావిస్తున్నాం.  వచ్చే సంవత్సరానికి 8 శాతం లేదా అంతకంటే ఎక్కువ వృద్ధిని ఆశిస్తున్నాం" అని మహీంద్రా  గ్రూప్ సీఈఓ కూడా అయిన షా చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ మొదటి క్వార్టర్లో (2023-–24 ఏప్రిల్–-జూన్ ) 7.8 శాతం,  రెండవ క్వార్టర్లో (జూలై–-సెప్టెంబర్ ) 7.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొదటి అర్ధభాగంలో (ఏప్రిల్–-సెప్టెంబర్) వృద్ధి రేటు 7.7 శాతంగా ఉంది. ఆర్థిక వ్యవస్థపై ఒత్తిళ్ల గురించి షా మాట్లాడుతూ, "అసలు సమస్యలు భారతదేశం వెలుపల ఉన్నాయి. ఇజ్రాయెల్,  గాజాలకు సంబంధించి సమస్యలను చూస్తున్నాం. ఉక్రెయిన్‌‌‌‌లో ఏమి జరుగుతోందో తెలుసు.   రెండో ఆందోళన ఏమిటంటే, పాశ్చాత్య దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు. వాటిలో సమస్యలు ఇంకా తగ్గుముఖం పట్టాయని మేం భావించడం లేదు. భారతదేశంలో మనం చూసిన దానికంటే వడ్డీ రేటు చాలా ఎక్కువ స్థాయిలో ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ఎక్కువ ఆర్థిక సమస్యలు ఉంటే, అవి భారతదేశంపై ప్రభావం చూపుతాయి. మేం వాటిని రెండు ప్రధాన ఆందోళనలుగా చూస్తాం" అని షా వివరించారు.  విదేశాల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం వృద్ధి జోరును కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.

మన కంపెనీలు గుడ్​

అనేక భారతీయ కంపెనీల బ్యాలెన్స్ షీట్లు బాగా ఉన్నాయని, అప్పులు తగ్గాయని అన్నారు. గ్లోబల్​ ఎకానమీలో పెద్ద పాత్ర పోషించడానికి అవి సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ‘‘భారతీయ కంపెనీలకు సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి.  సామర్థ్యం పెంపు కొనసాగుతోంది. డిమాండ్ పెరుగుతూనే ఉంది.  ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతుంది కాబట్టి పెట్టుబడి వేగం మరింత ఊపందుకుంటుంది” అని షా అన్నారు. వరుసగా ఐదోసారి వడ్డీ రేటును యదాతథంగా ఉంచాలనే రిజర్వ్ బ్యాంక్ నిర్ణయంపై ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆర్బీఐని ఈ విషయంలో మెచ్చుకోవాలని, మంచి నిర్ణయం తీసుకున్నదని అన్నారు. రేట్లు తగ్గించడం కంటే ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం చాలా ముఖ్యమైన అంశమని అభిప్రాయపడ్డారు. ఆర్​బీఐ నిర్ణయాలు ఇప్పటి వరకు మంచి ఫలితాలనే ఇచ్చాయని చెప్పారు. తగిన సమయంలో రేటు తగ్గింపుకు అవకాశం ఉంటే పరిశ్రమ దానిని స్వాగతిస్తుందని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఈ ఏడాది ఫిబ్రవరి 8 నుంచి వడ్డీరేట్లను మార్చలేదు. వరుసగా ఐదవసారి వడ్డీ రేటును 6.5 శాతం వద్ద మార్చకుండా ఉంచింది.  2047 నాటికి దేశాన్ని 'వికసిత భారత్' లక్ష్యం వైపు నడిపించేందుకు మేక్ ఇన్ ఇండియా చొరవ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయ రంగం బాగోగులు,   సుస్థిరతపై ఫిక్కీ కార్యకలాపాలు ఉంటాయని వినీశ్​ షా చెప్పారు.