ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

ఆలిండియా ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌‌ను సస్పెండ్ చేసిన ఫిఫా

ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్కు ఫిఫా షాకిచ్చింది. భారత ఫుట్బాల్ సమాఖ్యను సస్పెండ్ చేస్తున్నట్లు ఫిఫా ప్రకటించింది. భారత ఫుట్బాల్ ఫెడరేషన్ లో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉన్నట్లు ఫిఫా తేల్చింది. ఇలాంటి  అసోసియేషన్లను  తాము గుర్తించలేమని స్ఫష్టం చేసింది. ఈ సస్పెన్షన్‌ తక్షణమే అమల్లోకి వస్తుందని ఫిఫా వెల్లడించింది. ఫిఫా చట్టాలను ఉల్లఘించినందుకే ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ పై చర్యలు తీసుకున్నట్లు వివరించింది. భారత ఫుట్బాల్ సమాఖ్య సస్పెన్షన్పై ఫిఫా కౌన్సిల్ బ్యూరో ఏకగ్రీవ తీర్మానం చేసింది.

భారత ఫుట్బాల్ ఫెడరేషన్కు పూర్తి స్థాయి కార్యవర్గం లేదు. కేవలం ముగ్గురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కమిటీ కార్యకలాపాలను సాగిస్తోంది. దీంతో ఫిఫాలో బయటి వ్యక్తుల జోక్యం ఎక్కువైంది. ఈ విషయంపై భారత్ను ఫిఫా పలుమార్లు హెచ్చరించింది. అయినా భారత సమాఖ్య పట్టించుకోలేదు. దీంతో ఫిఫా నిషేధం విధించింది. ఫిఫా నిర్ణయంతో ముగ్గురు సభ్యుల AIFF ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలు పూర్తిగా రద్దు అయ్యాయి. AIFFపై పాలక మండలి తిరిగి నియంత్రణ పొందేందుకు నిర్వాహకుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించింది. ఫిఫా చట్టాల ప్రకారం ప్రతి ఫుట్బాల్ ఫెడరేషన్ 12 నుంచి 15 మందితో కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి. కానీ ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ మాత్రం  ముగ్గురితోనే కార్యవర్గ కమిటీని నడిపిస్తోంది.

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్  సస్పెన్షన్‌ కారణంగా ఈ ఏడాది అక్టోబర్‌ 11 నుంచి  30 వరకు భారత్‌లో జరగాల్సిన ఫిఫా U-17 ఉమెన్స్  వరల్డ్ కప్ 2022పై అనిశ్చితి నెలకొంది. ఈ టోర్నీ భారత్‌ నుంచి మరో దేశానికి తరలించే అవకాశం ఉంది. మరోవైపు భారత ఫుట్‌బాల్ ప్లేయర్లంతా ఫిఫా నిర్ణయాన్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని భారత ఫుట్ బాల్ స్టార్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదన్నాడు.