
కర్ణాటక ఎన్నికల వేళ జేడీఎస్ కు హసన్ సీటు తలనొప్పిగా మారింది. హసన్ టికెట్ విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు హెచ్‌డి కుమారస్వామి, హెచ్‌డి రేవణ్ణ మధ్య చిచ్చు నెలకొంది. ఆ సీటును తన భార్య భవానికే కేటాయించాలని రేవణ్ణ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ సీటును జేడీఎస్ కార్యకర్త స్వరూప్ గౌడకు టికెట్ ఇచ్చేందుకు కుమారస్వామి మొగ్గుచూపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ క్రమంలో సమస్యను పరిష్కరించేందుకు జేడీఎస్ అధినేత దేవెగౌడ రంగంలోకి దిగారు. కుటుంబ సభ్యులతో భేటీ అయిన దేవెగౌడ .. పార్టీ అధికారంలోకి వస్తే భవానికి ఎమ్మెల్సీ ఇవ్వాలని దేవెగౌడ చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అందుకు ఓప్పుకోని రేవణ్ణ.. పార్టీ టికెట్ ఇవ్వకుంటే తన భార్య భవానిని హసన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది.
జేడీఎస్ కు హాసన్ నియోజకవర్గం ఎప్పటి నుంచో కంచుకోటగా ఉంది. ఇక ఇప్పటికే తొలి జాబితాను విడుదల చేసిన జేడీఎస్ .. హసన్ సీటు విషయంలో క్లారిటీ రాకపోవడంతో రెండవ జాబితాను రిలీజ్ చేయడంలో ఆలస్యం జరుగుతుందని సమాచారం. మే 10న కర్ణాటకలో ఎన్నికలు జరగనున్నాయి. 13న ఫలితాలు వెలువడనున్నాయి.