స్టాఫ్‌‌‌‌ నర్స్ పోస్టుల భర్తీ..పూర్తయ్యేదెన్నడు?.. ఇప్పటికీ విడుదల కాని ఫైనల్ కీ

స్టాఫ్‌‌‌‌ నర్స్ పోస్టుల భర్తీ..పూర్తయ్యేదెన్నడు?..  ఇప్పటికీ విడుదల కాని ఫైనల్ కీ

హైదరాబాద్, వెలుగు :  ప్రభుత్వ దవాఖాన్లలో స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టుల భర్తీ నత్తనడకన సాగుతోంది. ఎగ్జామ్ రాసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న 38 వేల మంది అభ్యర్థులు.. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు తీరుతో ఆందోళనకు గురవుతున్నారు. టీఎస్‌‌‌‌పీఎస్సీ రిక్రూట్‌‌‌‌మెంట్ చేస్తే ఏండ్లకు ఏండ్లు గడుస్తోందని, మెడికల్ రిక్రూట్‌‌‌‌మెంట్ బోర్డు ఏర్పాటు చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దవాఖాన్లు, గురుకులాల్లో ఖాళీగా ఉన్న 5,204 స్టాఫ్ నర్స్‌‌‌‌ పోస్టులకు గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో మెడికల్ బోర్డు నోటిఫికేషన్ ఇచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఆగస్టు 2న రాత పరీక్ష నిర్వహించారు. ఈ పోస్టులకు 40,936 మంది దరఖాస్తు చేసుకోగా.. 38,674  మంది అభ్యర్థులు ఎగ్జామ్‌‌‌‌కు హాజరయ్యారు. ఆ తర్వాత నాలుగు రోజులకే ఆన్సర్ కీ కూడా విడుదల చేశారు. ఆగస్ట్‌‌‌‌ 9వ తేదీ నాటికి ప్రిలిమినరీ కీకి సంబంధించి అబ్జెక్షన్స్ తీసుకోవడం కూడా పూర్తయింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం తుది కీ విడుదల చేస్తామని ప్రకటించిన మెడికల్ బోర్డు, ఇప్పటివరకూ ఫైనల్ కీ ఇవ్వలేదు. రిజల్ట్ ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరో పది రోజుల్లో వస్తుందన్న ప్రచారం జరుగుతోంది. షెడ్యూల్ వచ్చిన వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. అప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నిలిచిపోయే అవకాశం
ఉందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కొత్త పోస్టులపై స్పష్టత కరువు

ప్రస్తుతం రిక్రూట్‌‌‌‌ చేస్తున్న 5,204 పోస్టులు కాకుండా మరో 1,827 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి రెండు నెలల కింద ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నోటిఫికేషన్‌‌‌‌లోనే వీటిని కూడా యాడ్ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటివరకు ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. మెడికల్‌‌‌‌ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటళ్లు, ఇతర ప్రభుత్వ దవాఖాన్లలో నర్సింగ్ స్టాఫ్ కొరత విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా పర్మిషన్ వచ్చిన పోస్టులను కూడా ఇదే రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో కలిపేయాలని ప్రభుత్వానికి హెల్త్ ఆఫీసర్లు సూచించారు. కానీ, ఇందుకు సర్కార్ ఇప్పటివరకు సుముఖత వ్యక్తం చేయలేదు. నర్సింగ్ అభ్యర్థులు మాత్రం కొత్త పోస్టులను కూడా ఇదే రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రి హరీశ్‌‌‌‌రావు, హెల్త్ సెక్రటరీ రిజ్వీకి పలుమార్లు వినతిపత్రాలు అందజేశారు.

మళ్లీ లొల్లేనా!

గతంలో జరిగిన నర్సింగ్ రిక్రూట్‌‌‌‌మెంట్‌‌‌‌లో అనేక అవకతవకలు జరిగాయి. అర్హత లేని వాళ్లకు కూడా వెయిటేజీ మార్కులు కలిపిన ఆఫీసర్లు రూ.కోట్లు వెనకేసుకున్నారు. 2017లో నోటిఫికేషన్ ఇచ్చి 2021లో రిజల్ట్ విడుదల చేసిన సర్కార్.. అవినీతిపరులపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. నోటీసులు, ఎంక్వైరీల పేరిట కాలయాపన చేస్తూ వస్తున్నారు. ఈసారి కాంట్రాక్ట్ నర్సులతో పాటు అవుట్‌‌‌‌సోర్సింగ్ నర్సులకు కూడా వెయిటేజీ మార్కులు కలిపారు. ఎగ్జామ్ రిజల్ట్ విడుదల చేసిన తర్వాత, మెరిట్ లిస్టులో ఉన్న వారి స్టడీ సర్టిఫికెట్స్‌‌‌‌, వెయిటేజీ మార్కుల సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. గతంలో ఈ వెరిఫికేషన్ ప్రక్రియలోనే అవకతవకలు బయటపడి, రిక్రూట్‌‌‌‌మెంట్ ఏడాదికిపైగా ఆలస్యమైంది. కోర్టులో కేసులు పడ్డాయి. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందోనని అభ్యర్థులు, ఆఫీసర్లలో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది.